హైదరాబాద్, ఏప్రిల్ 16(నమస్తే తెలంగాణ): లగచర్ల ఘటన అనంతరం భూసేకరణ విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తున్నది. జహీరాబాద్ నిమ్జ్ (నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్) కోసం ప్రతిపాదిత భూసేకరణలో మూడు గిరిజన తండాలతోపాటు పలు పాఠశాలలకు సర్కారు మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు త్వరలో నోటిఫికేషన్ జారీకానున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, న్యాల్కల్, ఝరాసంగం మండలాల పరిధిలోని 17 గ్రామాల్లో సుమారు 12,600 ఎకరాల్లో నిమ్జ్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. 2016లో ప్రాజెక్టు మంజూరు కాగా, కేసీఆర్ సర్కారు హయాంలోనే సగానికంటే ఎక్కువ భూసేకరణ పూర్తయింది. కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులూ వచ్చాయి. సేకరించిన భూముల్లో సుమారు 3,600 ఎకరాలను పరిశ్రమల కోసం అభివృద్ధి చేసేందుకు టీజీఐఐసీ చర్యలు చేపడుతున్నది. ఈ నేపథ్యంలో మిగిలిన భూసేకరణ నుంచి ముంగితండ, చీలపల్లి, రుక్మాపూర్ తండాలతోపాటు అక్కడి పాఠశాలలను మినహాయించారు. ఈ మూడు గ్రామాల్లో 150 ఎకరాలు సేకరించాల్సి ఉంది.
మరోవైపు మామిడ్గి, హుసెల్లి, గణేశ్‌పూర్ తదితర గ్రామాల రైతులు తీవ్రంగా వ్యతిరేకించడంతో కొద్దిరోజులు భూసేకరణ ప్రక్రియను నిలిపివేసిన అధికారులు.. తాజాగా హుసెల్లిలో 653.08 ఎకరాలు సేకరించేందుకు నోటిఫికేషన్ జారీచేశారు. 491 మంది రైతుల నుంచి ఈ భూములను సేకరించాలని నిర్ణయించారు. వీటిలో కొంత మేరకు పట్టా భూములు కాగా, మిగిలివని అసైన్డ్ భూములు కావడం గమనార్హం. మరోవైపు భూసేకరణకు గతంలో అంగీకరించిన అన్నదాతలు సైతం ఇప్పుడు పెరిగిన ధరల కారణంగా తమ భూములు ఇచ్చేందుకు ఒప్పుకోవడం లేదు.
కొందరు ఇప్పటికే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆ భూములను అభివృద్ధి చేసి పరిశ్రమలకు కేటాయించే అవకాశం లేకుండాపోయిందని.. 3,600 ఎకరాలు మాత్రమే అందుబాటులో ఉండటంతో ప్రస్తుతానికి అక్కడ ప్లాట్లను అభివృద్ధి చేసి కేటాయించేందుకు చర్యలు చేపడుతున్నట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. గతంలో ఎకరానికి రూ.4 లక్షల చొప్పున చెల్లించి భూసేకరణ చేశారని, ఇప్పుడు జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు రూ.కోటికి తక్కువ లేవని రైతులు చెబుతున్నారు. కాగా, ప్రభుత్వం రూ.15 లక్షలు మాత్రమే ఇస్తున్నదని వారు వాపోతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు భూములు ఇచ్చేదే లేదని రైతులు స్పష్టం చేస్తున్నారు. న్యాల్కల్ మండలం సహా పరిసర ప్రాంతాల్లో ఓ వైపు ఫార్మాసిటీ, మరోవైపు నిమ్జ్ పేరుతో భూములన్నీ సేకరిస్తున్నారని, దీంతో తమకు వ్యవసాయం చేసుకునేందుకు ఒక్క గుంట కూడా మిగలడం లేదని వాపోతున్నారు.
వికారాబాద్ జిల్లా లగచర్లలో గిరిజన రైతుల తిరుగుబాటు వల్లే ప్రభుత్వం తాజా భూసేకరణపై వెనుకడుగు వేసినట్టు తెలుస్తున్నది. లగచర్ల పరిధిలో ఫార్మాసిటీ పేరుతో భూసేకరణ నోటిఫికేషన్ జారీచేసిన ప్రభుత్వం రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నది. పోలీసుల పహారాలో భూసేకరణ చేపట్టడంతో రైతులు ఆందోళన చేపట్టారు. దీంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత గ్రీన్ ఇండస్ట్రియల్ కారిడార్‌గా మార్చి మరో నోటిఫికేషన్ జారీచేసినా రైతులు వెనక్కి తగ్గలేదు. ఈ నేపథ్యంలో నిమ్జ్ ప్రతిపాదిత భూసేకరణ నుంచి గిరిజన తండాలను మినహాయించినట్టు పలువురు పేర్కొంటున్నారు.