Annaram | అన్నారం బ్యారేజీపై మీడియా, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని బ్యారేజీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ యాదగిరి పేర్కొన్నారు. బ్యారేజీలో ఎలాంటి బుంగ ఏర్పడలేదని.. సహజంగా పర్మియేబుల్ ఫౌండేషన్లో వస్తున్న నీరే తప్పా.. నీటితో పాటు ఎలాంటి ఇసుక రేణువులు రావడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఫ్రెష్ వాటర్ పరిమితి లోబడే వస్తున్నాయని.. సీపేజ్తో బ్యారేజీకి ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. అన్నారం బ్యారేజీకి ఢోకా లేదని.. పరిసర ప్రాంతాల్లోని ప్రజలు రూమర్లను నమ్మొద్దని కోరారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ప్రతి సంవత్సరం సహజంగా ఓఅండ్ఎం పనులు చేపడుతామన్నారు.
1,275 మీటర్ల పొడువులో రెండుచోట్ల సీపేజ్ ఉందని, ఎక్కడా కూడా ఇసుక రావడం లేదన్నారు. సాగునీటి పారుదలశాఖ, బ్యారేజీ నిర్మాణ సంస్థ ఆఫ్కాన్స్ల మధ్య కాంటాక్ట్ ఉంటుందన్నారు. డిఫెక్ట్ లయబులిటీ కాలంలో దాని నిర్వహణ బాధ్యత వాళ్లదేనన్నారు. సీపేజ్ ఉన్న చోట నీళ్లు తగ్గినప్పుడు మెటల్, సాండ్, ఫిల్టర్ మీడియా వేస్తున్నామన్నారు. సాండ్తో రింగ్బండ్ని కూడా వేస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఏటా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ మైంటెనెన్స్ ఉంటుందని.. ప్రాజెక్టు తట్టుకునే విధంగా సీపెజ్ వాటర్ పోవడానికి డిజైన్లలోనే ఏర్పాట్లు ఉంటాయన్నారు. బ్యారేజీ డిజైన్ మాన్యువల్స్ ప్రకారం.. ఉండడం బ్యారేజీ భద్రత దృష్ట్యా అవసరమని.. అవసరం ఐతే కెమికల్ గ్రౌటింగ్ వేస్తామని వివరించారు.