మహబూబ్‌నగర్ అర్బన్/షాబాద్, ఆగస్టు 17: జమీందారుల అరాచకాలను సహించలేక కడుపు మండి కత్తిపట్టిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఆయన పేదోళ్ల రాజు అని కొనియాడారు. గురువారం రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
మహబూబ్‌నగర్‌లోని పద్మావతి కాలనీలోని గ్రీన్‌బెల్ట్ వద్ద సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయాచోట్ల మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో పాపన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలని కొట్లాడితే అప్పటి పాలకులు పట్టించుకోలేదని మండిపడ్డారు. స్వరాష్ట్రంలో తామంతా సీఎం కేసీఆర్‌కు ఒక్క ఉత్తరం ఇవ్వడంతోనే సర్వాయి పాపన్న జయంతిని అధికారికంగా నిర్వహించడంతోపాటు ట్యాంక్‌బండ్‌పై విగ్రహాన్ని కూడా పెడతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇచ్చినట్టు తెలిపారు.