హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్, సారా పై ఎక్సైజ్‌శాఖ ఉక్కుపాదం మోపుతున్నది. ఎన్ఫోర్స్మెంట్ బృందాలతో ఎక్కడికక్కడే సోదాలు నిర్వహిస్తున్నది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో రూ.1.73 కోట్ల విలువైన గంజాయి, బెల్లం పట్టుకొని ఎక్సైజ్‌శాఖ రికార్డులు సృష్టించింది. ఇటీవలి ఎక్సైజ్‌శా ఖ సోదాల్లో 30 గ్రాముల ఎండీఎంఏ, 80 గ్రాముల హెరాయిన్, ఓపీఎం చిక్కింది. హైదరాబాద్‌లో రూ.1.70 కోట్ల విలువ చేసే డ్రగ్స్, రూ.2 కోట్ల స్పిరిట్‌ను సీజ్ చేశారు. భద్రాచలంలో 492 కేజీల, మణుగూరులో కోటి విలువైన 477 కేజీల గంజాయిని ఎక్సైజ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.
ఆగస్టు 31 నాటికి రాష్ట్రంలో సారా మూలాలను పూర్తిగా ధ్వంసం చేయాలనే లక్ష్యంతో ఎక్సైజ్ పోలీసులు సోదాలు చేపడుతున్నారు. ప్రధానంగా ఆదిలాబాద్, నల్లగొండ, కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్, భూపాలపల్లి, భద్రాచలం, నిజామాబాద్, కొడంగల్, పరిగి ప్రాంతాల్లోని 26 ఎక్సైజ్ పోలీస్స్టేషన్ల పరిధిలో సారా తయారీ, వినియోగం ఎకువగా ఉంటుందని ఆబ్కారీశాఖ గుర్తించింది. ఆయా జిల్లాల్లో విస్తృతంగా సోదా లు చేపట్టిన అధికారులు.. మేలో 3,380 కేసులు నమోదు చేశారు. 16,951 లీటర్ల సారాను, 14,83,600 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వసం చేశారు. 19,477 క్వింటాళ్ల బెల్లం, 1617 కేజీల అల్లం స్వాధీనం చేసుకున్నారు. 1,159 మందిని అరెస్టు చేసి, రూ.4.45 లక్షల జరిమానాలను వసూలు చేశారు. సారా నిర్మూలనే లక్ష్యంగా ముడిపదార్థాలపై నిఘా పెంచారు. మే నెలలో 100 కేసులు నమోదు చేసి, 1,396 లీటర్ల నాన్ డ్యూటీపెయిడ్ లిక్కర్‌ను సీజ్ చేసి, 34 మందిని అరెస్టు చేశారు.