హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో మద్యం ప్రవాహంతోపాటు మాదకద్రవ్యాల సరఫరాను అడ్డుకునేందుకు అడుగడుగునా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్టు ఎక్సైజ్ శాఖ కమిషనర్ శ్రీధర్ వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని చెక్‌పోస్టుల్లో ప్రత్యేకంగా సీసీకెమెరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఇప్పటికే ఉన్న 21 (ఏపీ సరిహద్దులో 8, మహారాష్ట్ర సరిహద్దులో 8, కర్ణాటక సరిహద్దులో 4, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో 1) శాశ్వత చెక్‌పోస్టులకు అదనంగా మరికొన్నింటిని ఏర్పాటు చేసి, 24 గంటూ తనిఖీలు చేపడుతున్నట్టు ‘నమస్తే తెలంగాణ’కు వివరించారు.
రాష్ట్రంలోని 19 మద్యం డిపోలు, 19 డిస్టలరీలు, 6 బ్రూవరీల్లో అవకతవకలు జరగకుండా చూసేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టినట్టు శ్రీధర్ తెలిపారు. దీనిలో భాగంగా ఇప్పటికే అన్ని విభాగాల్లో 570 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, వాటిని హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించినట్టు చెప్పారు. గతంలో జరిగిన లోపాలను సరిదిద్దుకుంటూ, కొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నామని, మద్యం తయారీ కేంద్రాల నుంచి ప్యాకింగ్, లోడింగ్, షాపులకు చేరేవరకూ అడుగడుగునా పర్యవేక్షిస్తున్నామని, ఎక్కడైనా తప్పు జరిగితే వెంటనే చర్యలు చేపడుతున్నామని వివరించారు.
రాష్ట్రంలో ప్రతినెలా 30 లక్షల కేసుల మద్యం తయారవుతుందని, అమ్మకాలు కూడా అదేస్థాయిలో జరుగుతున్నాయని శ్రీధర్ తెలిపారు. ఈ ఏడాది మద్యం ఉత్పత్తి కొంత తగ్గినట్టు చెప్పారు. మద్యం అమ్మకాలు, పన్నులు, లైసెన్స్ ఫీజుల ద్వారా రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు ప్రతినెలా దాదాపు రూ.3 వేల కోట్ల ఆదాయం వస్తున్నట్టు వెల్లడించారు. మద్యం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.32 వేల కోట్లు, నిరుడు రూ.35 వేల కోట్లు వచ్చినట్టు తెలిపారు. ఇటీవల ఎక్సైజ్ శాఖలో జరిగిన బదిలీలన్నీ ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడే జరిగాయని, ‘టానిక్ లిక్కర్ మార్ట్’ కేసు విచారణలో ఉన్నదని చెప్పారు.
రాష్ట్రంలో గత నెల 16 నుంచి ఈ నెల 18 వరకు రూ.30.12 కోట్ల విలువైన అక్రమ మద్యం, డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్టు శ్రీధర్ వెల్లడించారు. ఇందులో రూ.17.87 కోట్ల విలువైన 6,76,275 లీటర్ల మద్యం, రూ.12 కోట్ల విలువైన 319 కేజీల డ్రగ్స్ ఉన్నట్టు వివరించారు. ఐడీ లిక్కర్, నాన్-డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్డీపీఎల్)ను అరికట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఐడీ లిక్కర్ ఎక్కువగా ఉండే మంచిర్యాల, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్, వరంగల్, మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెంతోపాటు ఎన్డీపీఎల్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మహబూబ్‌నగర్, గద్వాల్, సంగారెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి, ఖమ్మం, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, హైదరాబాద్‌లో విస్తృతంగా స్పెషల్ డ్రైవ్‌లు కొనసాగుతున్నట్టు చెప్పారు.