హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 28 : భారీ వర్షాల కారణంగా(Rain effect) కాకతీయ యూనివర్సిటీ పరిధిలో (Kakatiya University)ఆగస్టు 28,29 తేదీల్లో జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్ తెలిపారు. మిగతా పరీక్షలన్నీ యధావిధిగా కొనసాగుతాయని, వాయిదా వేసిన పరీక్షల షెడ్యూల్ ను మళ్లీ ప్రకటిస్తామని పేర్కొన్నారు. కాగా, గురువారం మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
అదేవిధంగా జగిత్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.