హైదరాబాద్, ఏప్రిల్ 20(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్‌లో నిరుద్యోగ సభలు చిచ్చురేపుతున్నాయి. ఇప్పటికే నల్లగొండ సభ విషయంలో ఉత్తమ్, రేవంత్‌రెడ్డి నడుమ విభేదాలు సమసిపోకముందే.. ఖమ్మంలో సీఎల్పీ నేత భట్టి, మాజీ ఎంపీ రేణుకా చౌదరి నడుమ విభేదాలు బయటపడ్డాయి. ఈ నెల 24న ఖమ్మంలో నిర్వహించే నిరుద్యోగ సభకు తాను రాలేనని రేణుకా చౌదరి స్పష్టం చేశారు.
భట్టి పాదయాత్రను కూడా రేణుకా చౌదరి పెద్దగా పట్టించుకోవడం లేదని కార్యకర్తలే చెప్పుకుంటున్నారు. జిల్లాలో ఈ ఇద్దరూ తమ ఆధిపత్యం కోసం తరచూ పోటీపడుతూనే ఉంటారు. ఈ నేపథ్యంలోనే రేణుకా చౌదరి సహాయ నిరాకరణకు దిగినట్టు తెలిసింది. తన పరిధిలోని నల్లగొండలో నిరుద్యోగ సభను తనకు తెలియకుండా ఎలా పెడతారని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రేవంత్‌ను నిలదీశారు. దీంతో దిగొచ్చిన రేవంత్‌రెడ్డి.. ఆ సభను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.