హైదరాబాద్/ సంగారెడ్డి, జనవరి 26 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ ఆదివారం సంగారెడ్డిలోని తన నివాసంలో కన్నుమూశారు. కుటుంబసభ్యులు, బంధువులు, అభిమానులు, వివిధ రాజకీయపార్టీల నాయకులు, ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. సంగారెడ్డిలోని రాజంపేట వద్ద ఉన్న వైకుంఠధామంలో కుమారుడు నూతన్ అంతిమసంస్కారాలు నిర్వహించారు. సత్యనారాయణ మృతిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం వ్యక్తంచేశారు.
సీనియర్ జర్నలిస్టుగా, తెలంగాణ ఉద్యమకారుడిగా ఆయన సేవలు, బీఆర్ఎస్ కోసం చేసిన కృషిని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో సత్యనారాయణ సేవలు చిరస్మరణీయమని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సంగారెడ్డిలోని సత్యనారాయణ నివాసంలో పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, భూపాల్‌రెడ్డి, మాజీ మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, దేశపతి శ్రీనివాస్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దేవీప్రసాద్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, బాలొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎంపీ వినోద్‌కుమార్, తెలంగాణ మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ బాధిత కుటుంబసభ్యులకు సానుభూతిని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి, మం త్రులు రాజనర్సింహ,పొ న్నం ప్రభాకర్ సంతాపం ప్రకటించారు. సత్యనారాయ ణ జర్నలిస్టుగా పీడిత ప్రజల పక్షాన నిలిచారు. 2001లో బీఆర్ఎస్లో చేరి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పనిచేశారు.