నయీంనగర్, అక్టోబర్16 : తనను టార్గెట్ చేస్తే ఎదుటి వారికే నష్టమని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి హెచ్చరించారు. మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ అరెస్ట్ కోసం పోలీసులు ఇంటికి రావడంపై గురువారం ఆయన మాట్లాడుతూ ఆ విషయం తనకు తెలియదని అన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 20 ఏండ్ల క్రితం పనుల కోసం తన ఇంటికి వచ్చేవారని గుర్తుచేశారు. తనకు ఎవరూ టార్గెట్ కాదని, తనను మాత్రం ఎవరైనా టార్గెట్ చేస్తే వారికే నష్టమని పేర్కొన్నారు. మీడియాతో మాట్లాడవద్దని తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షినటరాజన్ తనకు చెప్పారని, ఇప్పుడు మీడియాతో మాట్లాడుతూ తప్పుచేశానని తెలిపారు. ఎవరైనా తప్పొప్పులు మాట్లాడితే తాను వాటిని సెట్ చేస్తానని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనకు ఎమ్మెల్సీ ఇస్తానని అన్నారని చెప్పారు.
తాను ఏ రోజూ సచివాలయానికి వెళ్లలేదని, దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో ఆయన వాహనంలోనే ఒకసారి సచివాలయానికి వెళ్లానని తెలిపారు. సురేఖ గెలిచిన తర్వాత తొలిసారి బుధవారం రాత్రి ఆమె చాంబర్‌కు వెళ్లి వాస్తు చూసి వచ్చానని చెప్పారు. తనకు ఏదైనా పని ఉంటే నేరుగా మంత్రుల ఇండ్లకే వెళ్తాను కానీ, సచివాలయానికి వెళ్లనని పేర్కొన్నారు. తన బిడ్డకు మాట్లాడే స్వేచ్ఛ ఉన్నదని, నిన్న తను ఏం మాట్లాడిందో తెలియదని చెప్పారు. గతంలో తనపై ఎన్నో కుట్రలు జరిగాయని, అందుకే సురేఖ వాహనం తాను ఏ రోజూ ఎక్కలేదని తెలిపారు. వరంగల్‌లో మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద సెక్యూరిటీ తగ్గించినట్టుగా ఓ పోస్టు వైరల్ అయిందని, కానీ అది పూర్తిగా అవాస్తవమని, సెక్యూరిటీ యథావిధిగా ఉన్నదని మురళి తెలిపారు.