కరీంనగర్ కార్పొరేషన్, మే 30: జయ జయహే తెలంగాణ గేయ రచయిత అందెశ్రీ స్వరాష్ట్ర స్వాభిమానం ఇప్పుడు ఏమైందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ నిలదీశారు. తన గేయానికి సంగీతం అందించడానికి ఇప్పుడు ఆంధ్రావాళ్లు అక్కరకు వచ్చారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర గేయానికి బాణీలు తెలంగాణవారితోనే అందించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్‌లోని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారులు, మేధావులు, అమరవీరుల పాత్ర మరవలేనిదని పేర్కొన్నారు. అందుకే నాటి సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభలో అందెశ్రీని ఘనంగా సన్మానించి, తెలంగాణ జాతికి గొప్ప గేయాన్ని అందించావని ప్రశంసించారని గుర్తు చేశారు.
అనంతరం జరిగిన చర్చలో విద్యార్థులతోపాటు సబ్బండవర్ణాలు గుర్తుంచుకునేలా గీతాలాపన ఉండేలా ఆలోచన చేద్దామని చెప్తే అక్కడి నుంచి హుటాహుటిన వెళ్లిపోయింది అందెశ్రీ అని గుర్తుచేశారు. అనంతరం గత గేయంలో ఏ మాత్రం తగ్గించేది లేదని మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది అందెశ్రీనే అని పేర్కొన్నారు. మరి ఇప్పుడు రేవంత్‌రెడ్డితో కలిసి సమయాన్ని కుదిస్తూ, ముఖ్యంగా ఆంధ్రా సంగీత దర్శకుడు కీరవాణితో కలిసి గేయాన్ని ఎలా నిర్మాణం చేశారని ప్రశ్నించారు. తెలంగాణ వాళ్లని తొక్కాలని చూస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కీరవాణిని మించిన సంగీత దర్శకుడు ఎవరని ప్రశ్నిస్తూ ఆయన ఎవరిని అగౌరవపరుస్తున్నారని నిలదీశారు. ఖమ్మం బిడ్డ వందేమాతం శ్రీనివాస్‌కు తొమ్మిది నంది అవార్డులు వచ్చిన విషయం గుర్తులేదా? అని ప్రశ్నించారు. చంద్రబోస్ వంటి ఎందరో కవులు, సంగీత మహనీయు లు ఉన్నారని పేర్కొన్నారు. ‘జై తెలంగాణ’ అని ఏ రోజు కూడా అనని సీఎం రేవంత్‌రెడ్డితో రాష్ట్ర గేయాన్ని రూపకల్పన ఎలా చేశారని ప్రశ్నించారు. సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, గ్రంథాలయ మాజీ చైర్మన్ పొన్నం అనిల్, నాయకులు అనిల్, ఓంకార్, ప్రభాకర్ పాల్గొన్నారు.