హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ) : రైతులు పండించిన అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ చెల్లించాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మద్దతు ధరతో పాటే రైతుల అకౌంట్లలో బోనస్ వేయాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ప్రతి పంటకు బోనస్ చెల్లించాలని, కేవలం సన్న రకానికే ఇస్తామంటే కుదరని, ఈ విషయంలో రైతుల పక్షాన పోరాడుతామని స్పష్టంచేశారు.
ఈమేరకు ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి సోమవారం లేఖ రాశారు.వానకాలం పంట 1,46,28,000 మెట్రిక్ టన్నుల దాన్యానికి బోనస్ రూ.500 చొప్పున అంటే సుమారు రూ.7,314 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. సన్నరకాలకు సంబంధించి 88.09 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారని, దీనికి సుమారు రూ.4,404 కోట్ల బోనస్ చెల్లించాల్సి ఉంటుందని, దొడ్డు వడ్లకు రూ.2,909 కోట్ల బోనస్ చెల్లించాలని చెప్పారు.
ఈ మొత్తం ధాన్యంలో కోత పెడుతూ ప్రభుత్వం 47 లక్షల మెట్రిక్ టన్నులే కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నదని, మొత్తం రూ.7,314 కోట్ల బోనస్ ఇవ్వాల్సి ఉంటే కేవలం రూ.2,350 కోట్లు మాత్రమే బోనస్ చెల్లించేలా కొర్రీలు పెడుతున్నదని విమర్శించారు.
ఎక్కడ అమ్మినా ఇవ్వాలి..
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మితేనే బోనస్ ఇస్తామనటం సరికాదని పెద్ది సూచించారు. సన్నరకం బోనస్‌తో కలిపి రూ.2,820కి కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పిందని, ప్రైవేట్ వ్యాపారులు, మిల్లర్లు, ఇతర ట్రేడర్లు ఇప్పటికే తేమ శాతాన్ని పరిగణలోకి తీసుకోకుండా రూ.2,600 నుంచి రూ.3వేలకు కొంటున్నారని చెప్పారు. బోనస్‌తో కలిపినా రూ.2,820 మాత్రమే అవుతున్నప్పుడు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మితే రైతుకు క్వింటాల్‌పై రూ.200 నష్టం జరుగుతుందని చెప్పారు.
ప్రభుత్వ కేంద్రాల్లో పంట అమ్మలేదనే సాకుతో బోనస్‌ను ఎగ్గొట్టే ప్రయత్నం చేయవద్దని, రైతు ఎకడ ధాన్యం అమ్మినా బోనస్ చెల్లించాల్సిందేనని డిమాండ్‌చేశారు. బోనస్ విషయంలో కొర్రీ లు పెడుతున్నట్టు సమాచారం ఉన్నదని పాత పద్ధతిలో మద్దతు ధర మాత్రమే రైతులకు చెల్లించి తర్వాత బోనస్ ఖాతాల్లో వేస్తామని చెప్పడం దాటవేత ధోరణికి నిదర్శనమని విమర్శించారు.