హైదరాబాద్ సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ సొమ్మును ఉద్యోగులు దోచుకుంటున్నట్టుగా సీఎం రేవంత్‌రెడ్డి అవమానించడం సిగ్గుచేటని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉద్యోగులు నెలనెలా దాచుకున్న డబ్బును రిటైర్ అయిన తర్వాత వారికి తిరిగి ఇవ్వకుండా, వాళ్లను దొంగల్లా ప్రజల్లో ముద్రవేసేలా కుట్రపూరితంగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, టీజీపీఎస్సీ మాజీ సభ్యుడు విఠల్‌తో కలిసి శ్రీనివాస్‌గౌడ్ సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తాము తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా.. జీతాలు కాదు, తెలంగాణ ప్రజల జీవితాలు ముఖ్యమనే నినాదంతో కొట్లాడామని తెలిపారు. పది వేల మంది రిటైర్డ్ ఉద్యోగులకు తక్షణమే బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 5 డీఏలు ఇవ్వాలని, పీఆర్సీ అమలు చేయాలని కోరారు. డిమాండ్ల సాధన కోసం అన్ని పార్టీలకు చెందిన ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి తెలంగాణ ఎంప్లాయిస్ కోఆర్డినేషన్ కమిటీ (టీఈసీసీ)గా ఏర్పడినట్టు వెల్లడించారు. జూన్ 2 వరకు ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమానికి ఐక్య కార్యచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో ఉద్యోగుల హక్కుల సాధనకు కృషి చేశామని, చాలా ప్రయోజనాలు సాకారం చేశామని వెల్లడించారు. జీతాల పెంపు, పదోన్నతుల వంటి అనేక విధాలుగా గత ప్రభుత్వం ఉద్యోగులకు అండగా నిలిచిందని వివరించారు.
పర్యాటకులు తెలంగాణకు జరూర్ ఆనా అంటూ ప్రభుత్వం ఎలా చెప్తున్నదో అలాగే తాము పాంచ్ డీఏ జరూర్ దేనా అని డిమాండ్ చేస్తున్నట్టు శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ తెలిపారు. పీఆర్సీ గడువు దాటిందని, వెంటనే అమలు చేయాలని కోరారు. ఉద్యోగులు జేఏసీగా ఏర్పడి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారని, వారికి మద్దతుగా తాము కూడా పోరాడుతున్నట్టు పేర్కొన్నారు. 3.50 లక్షల మంది పెన్షనర్స్, రిటైర్డ్ అయినవారు 10 వేల మంది ఉన్నారని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నదని రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ మండిపడ్డారు. ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయపాన చేస్తున్నదని విమర్శించారు. సకలజనుల సమ్మెలో వీరోచిత పోరాటం చేసిన ఉద్యోగులను సీఎం రేవంత్‌రెడ్డి అవమానించడం సరికాదని హితవు పలికారు. 57 సమస్యల్లో 45 పరిష్కరించినట్టు ప్రభుత్వం చెప్తున్నదని, ఆ జీవోలు ఎక్కడున్నాయని బయటపెట్టాలని సవాల్ విసిరారు. గతంలో పెన్షనర్లను గోసపెట్టిన చంద్రబాబును గద్దె దించామని గుర్తుచేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి రూ.3.5 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టారని, ఇందులో ఉద్యోగులకు ఖర్చయ్యేది నెలకు రూ.6 వేల కోట్లు మాత్రమేనని తెలిపారు. పరిపాలన వ్యయమంతా ఉద్యోగుల జీతాలకే సరిపోతున్నదంటూ దుష్ప్రచారం చేయడం తగదని చెప్పారు. గతంలో చంద్రబాబు కూడా ఇలాగే ప్రచారం చేసి అభాసుపాలయ్యారని గుర్తుచేశారు.
సమన్వయ కమిటీ ఏ ఇతర సంఘానికి కూడా పోటీకాదని మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి తెలిపారు. ఇది కేవలం సమన్వయ కమిటీ మాత్రమేనని పేర్కొన్నారు. సీఎం మాట్లాడిన తర్వాత ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారని చెప్పారు. తెలంగాణ మాడల్ స్కూల్లో పనిచేస్తున్న రెగ్యులర్ టీచర్లకు జీతం ఇంకా రాలేదని చెప్పారు. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ కమిటీ ఎవరిని సంప్రదిస్తుందో అర్థం కావడంలేదని విమర్శించారు. సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు భుజంగ్‌రావు, హమీద్, మోహన్, శ్యామ్, నారాయణ్‌రెడ్డి, హసన్, బాలమురళి, కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.