కేసుల పేరిట కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ డ్రామాకు తెరలేపిందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. తెలంగాణ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఫార్ములా-ఈ కార్ రేస్‌ను రద్దు చేసి రాష్ట్రానికి తీరని నష్టం మిగిల్చిందని ఆరోపించారు.
సోమవారం తెలంగాణ భవన్లో మీడియాతో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై నిలదీస్తున్న మాజీ మంత్రి కేటీఆర్‌ను అణచివేసేందుకే తప్పుడు కేసులు పెడుతున్నదని మండిపడ్డారు. ఏసీబీ కేసులో విచారణకు హాజరయ్యేందుకు వచ్చిన కేటీఆర్‌ను ఉద్దేశపూర్వకంగానే అడ్డుకొని అనవసర రాద్ధాంతం చేస్తున్నదని దుయ్యబట్టారు. లాయర్ల సహాయం తీసుకోవద్దంటూ రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నదని విమర్శించారు.
కాంగ్రెస్ సర్కారు ఏడాది పాలనలో అన్ని వర్గాలకు తీరని అన్యాయం చేసిందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రైతు భరోసాను కుదించి అన్నదాతను మోసగించిందని దుయ్యబట్టారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% కోటాను ఎగ్గొట్టేందుకు యత్నిస్తున్నదని విమర్శించారు. ఈ విషయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే బలహీనవర్గాల నుంచి ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వం తప్పుడు పనులు, కక్షలు పక్కనబెట్టి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాల అమలుపై దృష్టి సారించాలని హితవు పలికారు.