Singreddy Niranjan Reddy | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్‌ను దుర్భాషలాడటమే రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నారని అన్నారు. ఒక సీఎం ప్రతిరోజూ బజారు భాష మాట్లాడటం సిగ్గు చేటు అని విమర్శించారు. ముఖ్యమంత్రి స్థాయిని రేవంత్ రెడ్డి దిగజారుస్తున్నాడని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌చేశారు. కాంగ్రెస్ నేతల మాదిరిగా బూతులు మాట్లాడి తమ స్థాయిని దిగజార్చుకోమని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ముఖ్యమంత్రి చల్లగుండాలని బీజేపీ కేంద్ర సహాయమంత్రి రోజూ సహకరిస్తూ తాపత్రయ పడుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఒకరిద్దరు బీజేపీ నేతలు మినహా అందరూ ఊడిగం చేస్తున్న విషయం రోజూ కళ్ల ముందు కనిపిస్తుందని అన్నారు. ఇచ్చిన హామీల అమలుపై నిలదీయకుండా, కాంగ్రెస్ పార్టీకి కష్టం రాకుండా బీజేపీ కాపాడుతున్నదని విమర్శించారు. పత్తికి మద్దతు ధర కోసం, వరి ధాన్యానికి రూ.500 బోనస్ కోసం బీజేపీ నేతలు, 8 మంది ఎంపీలు ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. ప్రతిపక్షంగా ప్రజల తరఫున నిలదీస్తూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు.
కేసీఆర్, కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నేతలపై కేసులు పెడతామంటే నోరు మూసుకుని కూర్చునేది లేదని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. నిందలు మీరే వేసి, కేసులు మీరే పెట్టి, శిక్షలు మీరే వేస్తారా అని మండిపడ్డారు. ఈ దేశంలో రాజ్యాంగం, న్యాయవ్యవస్థ చనిపోయిందా అని ప్రశ్నించారు. తమకు అధికారాన్ని శాశ్వతంగా ఇచ్చినట్లు, బీఆర్ఎస్ను శాశ్వతంగా ఓడించినట్లు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారని అన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని రేవంత్ రెడ్డి అంటున్నారని తెలిపారు. కానీ కేసీఆర్ కట్టించిన ఆలయాన్నే రేవంత్ రెడ్డి దర్శించుకున్నారని అన్నారు. ఇంకా వెయ్యి ఏండ్లయినా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం కేసీఆర్‌ను గుర్తుచేస్తూనే ఉంటుందని తెలిపారు. ప్రజల కోసం నిత్యం పాటుపడే వ్యక్తి కేసీఆర్ అని తెలిపారు. అలాంటి కేసీఆర్‌ను దుర్భాషలాడటమే రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి ప్రతిరోజూ బజారు భాష మాట్లాడటం సిగ్గు చేటు అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్థాయిని రేవంత్ రెడ్డి దిగజారుస్తున్నాడని విమర్శించారు.
పాలమూరు బిడ్డవై ఉండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను 11 నెలలుగా పడావుగా పెట్టావని రేవంత్ రెడ్డిపై నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. ఒక్క రోజు కూడా దానిని సందర్శించడం, సమీక్ష చేయడం చేయలేదని విమర్శించారు. నిజంగా చర్యలు తీసుకొని ఉంటే ఈ పాటికి జలాశయాలలో నీళ్లు నింపుకునే అవకాశం ఉండేదన్నారు. 90 శాతం పూర్తయిన ప్రాజెక్టు పనులను కొనసాగించకపోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
కృష్ణా జలాలను తరలించుకు పోవడానికి రాయలసీమ ఎత్తిపోతలతో ఏపీ వేసిన ఎత్తుగడలను అడ్డుకున్నామని తెలిపారు. జగన్ మొదలు పెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడానికి చంద్రబాబు రాత్రింబవళ్లు పనిచేయిస్తున్నారని నిరంజన్ రెడ్డి తెలిపారు. జగన్ మొదలు పెట్టాడని దానిని ఆపలేదని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ మోసాలను తెలంగాణ సమాజం గ్రహిస్తున్నదని నిరంజన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కాంగ్రెస్ నేతల మాదిరిగా బూతులు మాట్లాడి మా స్థాయిని దిగజార్చుకోమని అన్నారు.