మహబూబాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): లగచర్లలో గిరిజన కుటుంబాలపై ప్రభుత్వం చేయించిన దాడి రాహుల్ గాంధీకి కనిపించడం లేదా? అని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి కట్టే కప్పానికి రాహుల్‌గాంధీ నోరు తెరవడం లేదా? అని నిలదీశారు. గురువారం మానుకోట పట్టణంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్‌నాయక్ తదితరులతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. లగచర్లలో 300 కుటుంబాలపై అర్ధరాత్రి కరెంటు తీసేసి, పిల్లలు మహిళలు అని చూడకుండా విచక్షణారహితంగా పోలీసులు ప్రవర్తిస్తే దానిపై రాహుల్ గాంధీ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. లగచర్లలో గిరిజన రైతులపై జరిగిన దాడిని దేశ రాజధాని ఢిల్లీలో వివరించినా ఇప్పటివరకు రాహుల్ స్పందిచకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.
గురువారం మానుకోటలో నిర్వహించాల్సిన మహాధర్నాకు శాంతిభద్రతల పేరుతో పోలీసులు అనుమతి నిరాకరించడంపై మండిపడ్డారు. కేటీఆర్ పర్యటనను అడ్డుకుంటామని, అతనిపై రాళ్ల దాడి చేస్తామని జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ గిరిజన ప్రజాప్రతినిధులు మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి బహిరంగంగా మీడియా ముందు చెప్పినా పోలీసులు వారిపై ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ చెందిన సదరు ముగ్గురు ప్రజాప్రతినిధులపై సుమోటో కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కొడంగల్ నుంచి రేవంత్‌రెడ్డి పతనం ప్రారంభమైందని అన్నారు. రానున్న రోజుల్లో లగచర్ల ఘటనను జాతీయ స్థాయిలో తీసుకెళ్లి ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ.. హైకోర్టు అనుమతితో ఈ నెల 25న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గిరిజన రైతుల మహాధర్నా నిర్వహిస్తామని తెలిపారు.