హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో గన్‌కల్చర్ తెచ్చారని, కాంగ్రెస్ పాలన అరాచకాలకు కేరాఫ్‌గా మారిందని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ సుభిక్షంగా ఉండేదని, కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత అభివృద్ధి కనుమరుగై అరాచకం రాజ్యమేలుతున్నదని మండిపడ్డారు. మిస్‌వరల్డ్ పోటీల నుంచి మంత్రి కొండా సురేఖ వ్యవహారం వరకు అడుగడుగునా మహిళలకు అవమానాలు తప్ప ఒరిగిందేమీలేదని దుయ్యబట్టారు. భర్తను కోల్పోయి తప్పనిసరి పరిస్థితుల్లో బీఆర్ఎస్ తరుఫున జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో నిలిచిన మాగంటి సునీతా గోపీనాథ్‌ను మంత్రులు అపహాస్యం చేయడం దౌర్భాగ్యమని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంతూరులో రుణమాఫీ కాలేదన్న విషయాన్ని వెలుగులోకి తెచ్చేందుకు వెళ్లిన మహిళా జర్నలిస్టులపై కేసులు పెట్టి వేధించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను లెవనెత్తిన తమను ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా అవమానించారని గుర్తుచేశారు. ఆదివారం ఆమె తెలంగాణభవన్‌లో మాజీ మంత్రులు సునీతాలక్ష్మారెడ్డి, సత్యవతిరాథోడ్, ఎమ్మెల్సీ వాణీదేవి, మాజీ ఎంపీ మాలోత్ కవితతో కలిసి మీడియాతో మాట్లాడారు.
సీఎం గన్ పంపించిన వ్యవహారంపై మౌనమెందుకు?
‘ఒక నిందితుడిని అరెస్టు చేసేందుకు అర్ధరాత్రి మంత్రి ఇంటిపైకి వెళ్లిన పోలీసులు ఏం చేశారు? మంత్రి స్వయంగా నిందితుడిని కారులో ఎక్కించుకొని వెళ్లినా ఎందుకు కేసు నమోదు చేయలేదు? నల్లగొండకు చెందిన సిమెంట్ కంపెనీ బాధ్యులను బెదిరించిన వ్యవహారంపై ఎందుకు స్పందించలేదు? సీఎం రేవంత్‌రెడ్డే తన అనుచరుడు రోహిన్‌రెడ్డికి గన్ పంపించారని మంత్రి కూతురు చేసిన ఆరోపణలపై మౌనమెందుకు? రాష్ట్రంలో ఖాకీబుక్ తప్ప ఏ బుక్ లేదని చెప్పిన డీజీపీ ఇప్పుడు చోద్యం చూస్తున్నారెందుకు?’ అంటూ సబితాఇంద్రారెడ్డి ప్రశ్నించారు. సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టారని, ముఖ్యమంత్రిని విమర్శించారని చీటికిమాటికి కేసులు పెట్టే పోలీసులు కాంగ్రెస్ పాలనలోని అరాచకాలకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతిపక్షాలకు ఓ న్యాయం.. అధికారపక్షానికి మరో న్యాయమా?’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
సిట్‌తో విచారణ జరిపించాలి
రాష్ట్రంలో పాలనను గాలికొదిలేసిన ముఖ్యమంత్రి, మంత్రులు వాటాల పంపకాల్లో మునిగితేలుతున్నారని సబితా ఇంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో ఆమె కూతురు లెవనెత్తిన ప్రశ్నలే ఇందుకు సాక్ష్యమని స్పష్టంచేశారు. ఏకంగా సీఎం, మంత్రులపై అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వెంటనే సిట్ వేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గవర్నర్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తిచేశారు. మంత్రి సురేఖ ఘటన పార్టీ అంతర్గత వ్యవహారమని, పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ జోక్యంతో సద్దుమణిగిందని, క్యాబినెట్లో చర్చించలేదని మంత్రి సీతక్క బుకాయిస్తూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని విమర్శించారు. పార్టీ వ్యవహారమైతే మేడారం టెండర్ల విషయంలో మంత్రి పొంగులేటిపై ఎందుకు ఆరోపణలు చేశారని ప్రశ్నించారు.
కేంద్ర మంత్రులు పెదవివిప్పరెందుకు?
రాష్ట్రంలో గన్‌కల్చర్ పెరిగిపోయి ప్రజలు, పరిశ్రమల యాజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే బాధ్యాతయుతమైన పదవుల్లో ఉన్న కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఎందుకు పెదవివిప్పడంలేదని సబితాఇంద్రారెడ్డి ప్రశ్నించారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా ఉన్న బండి సంజయ్ ముఖ్యమంత్రిపై వచ్చిన ఆరోపణలపై కనీసం ఒక్కసారైనా సమీక్ష ఎందుకు చేయలేదని నిలదీశారు. సీఎం రేవంత్‌తో ఉన్న చీకటి ఒప్పందంతోనే మౌనంగా ఉంటున్నారని ఆరోపించారు. వారికి చిత్తశుద్ధి ఉంటే సీఎం, మంత్రుల వాటాలపై కేంద్ర సంస్థలతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
సీతక్క తల్లిదండ్రులపై ప్రమాణాలెందుకు? : సత్యవతి రాథోడ్
రాష్ట్రంలో పాలన గాడితప్పిందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి సమీపంలోనే అరాచకశక్తులు, సీఎం అనుచరులు గన్నులు పెట్టి పారిశ్రామికవేత్తలను బెదిరించే పరిస్థితులు రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. క్యాబినెట్లో వాటాల పంపిణీపై చర్చ జరిగిందని హరీశ్‌రావు చేసిన ఆరోపణలకు సమాధానమివ్వాల్సిన మంత్రి సీతక్క.. తన తల్లిదండ్రులపై ప్రమాణం పేరిట తప్పించుకొనేందుకు యత్నిస్తున్నదని ఆరోపించారు. ‘మంత్రి సురేఖ ఇంటిలో తలదాచుకున్న నిందితుడిని అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్లలేదా? మేడారం టెండర్లలో జోక్యం చేసుకుంటున్నారని సహచర మంత్రిపై ఆమె ఆరోపణలు చేయలేదా? సీఎం రేవంత్‌రెడ్డి అనుచరులు, సోదరులు బరితెగించారని, గన్స్‌తో బెదిరిస్తున్నారని మంత్రి సురేఖ కూతురు మీడియాకు చెప్పలేదా? తమకు అన్యాయం జరుగుతున్నదని ఇద్దరు మంత్రులు రచ్చకెక్కలేదా?’ అని ప్రశ్నించారు. పాలన చేతగాని కాంగ్రెస్ నాయకులు ఏ ముఖం పెట్టుకొని రెండేండ్ల విజయోత్సవాలు చేసుకుంటారని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ పాలనలోనే అన్నివర్గాలకు మేలు: వాణీదేవి
కేసీఆర్ పదేండ్ల పాలనలోనే అన్నివర్గాలు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్సీ వాణీదేవి పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సబ్బండజనులు గోసపడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మహిళలకు మహాలక్ష్మి కింద నగదు ఇవ్వకుండా, పింఛన్లు పెంచకుండా అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.