Revant-Nagam | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరం వేడెక్కుతున్నా కొద్దీ కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు పెరుగుతున్నాయి. జనగామ టికెట్ దక్కక పోవడంతో 45 ఏండ్ల పాటు పార్టీలో పని చేసిన తనను అవమానించారంటూ మాజీ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడమే కాదు.. సోమవారం సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.
ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనూ అసమ్మతి సెగ మొదలైంది. ఆశించిన అసెంబ్లీ సెగ్మెంట్ల టికెట్లు రాని వారంతా ఒక్కటవుతున్నారు. మాజీ మంత్రి- నాగం జనార్ధన రెడ్డి, కొల్లాపూర్ నేత చింతలపల్లి జగదీశ్వర్ రావు ఆధ్వర్యంలో సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లి గ్రామంలో అసమ్మతి నేతలు, కార్యకర్తలు సమావేశమయ్యారు.
అవకాశ వాది జూపల్లి కృష్ణారావు గెలిచిన తర్వాత పార్టీ మారరా? అని నాగం జనార్ధన రెడ్డి నిలదీశారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలవడం వల్లే వచ్చారని, కోవర్ట్ రాజకీయం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. పార్టీ కోసం కష్ట పడి పని చేసిన వారికి జరిగిన అన్యాయానికి రేవంత్‌దే బాధ్యత అని స్పష్టం చేశారు. పార్టీలో అన్యాయం జరిగిన నాయకులకు అండగా నిలిచి, కలిసి పోరాడతామని తేల్చి చెప్పారు. సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య, బీసీలను రేవంత్ అవమానించారని అన్నారు.
మరో కాంగ్రెస్ నేత చింతలపల్లి జగదీశ్వర్ రావు మాట్లాడుతూ తనను రేవంత్ రెడ్డి మోసగించారని ఆరోపించారు. కొల్లాపూర్‌లో తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తానంటూ తేల్చేశారు. తద్వారా జూపల్లిని ఓడించి బుద్ది చెబుతాం అని అన్నారు.