హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోలు కుంభకోణంపై మంగళవారం అసెంబ్లీ అట్టుడికింది. పౌరసరఫరాలశాఖలో జరిగిన అవినీతిని బయటపెట్టాలని బీఆర్ఎస్ పట్టుబట్టింది. రూ.1100 కోట్ల గోల్మాల్ నిగ్గుతేల్చాలని నిలదీసింది. ఈ వ్యవహారంలో సభాసంఘం వేయాలని డిమాండ్ చేసింది. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన రికార్డులను స్పీకర్ ముందు ఉంచాలని పట్టుబట్టింది. బీఆర్ఎస్ లేవనెత్తిన అంశాలను సర్కారు తిరస్కరించింది. సభాసంఘం వేయబోమని ప్రకటించింది. దీంతో సర్కారు తీరుకు నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సభాసంఘం వేయాల్సిందేనని పట్టుబట్టారు. ప్రభుత్వం తమ డిమాండ్లను ఎంతకూ పరిగణనలోకి తీసుకోకపోవడంతో మాజీ మంత్రి కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెల్‌లోకి దూసుకెళ్లారు. ప్రభుత్వం తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. ప్రభుత్వం మొండివైఖరి వీడాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు పట్టుకుని స్పీకర్ పోడియం ముందు బైఠాయించారు. దీంతో సభలో కొద్దిసేపు ఏం జరుగుతున్నదో తెలియని అయోమయం నెలకొన్నది. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో కేటీఆర్ ప్రభుత్వ తీరును నిరసించారు. రూ.1100 కోట్ల అవినీతిపై తమ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, సభాసంఘం వేస్తే నిజానిజాలు నిగ్గుతేలుతాయని చెప్పారు. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం 19 పద్దులకు సభ ఆమోదం తెలిపింది. స్పీకర్ సభను బుధవారానికి వాయిదా వేశారు.
శాసనసభలో సివిల్ సప్లయ్‌శాఖకు సంబంధించిన పద్దులపై జరిగిన చర్చలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కేటీఆర్ మండిపడ్డారు. ప్రజలకు సన్న బియ్యం ఇస్తే ప్రభుతాన్ని అభినందిస్తామని, కొత్త రేషన్‌కార్డులు జారీని స్వాగతిస్తామని చెప్పారు. కొత్త సభ్యులు 57 మంది ఉన్నారని, ఏ సభలో అయినా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతిపక్షం చెప్పడానికి అవకాశం కల్పించాలని, దానికి ప్రభుత్వం ఏకీభవించవచ్చు, విభేదించవచ్చు అని పేర్కొన్నారు. సభలో డిస్కషన్.. డిబేట్.. డీసెంట్‌గా జరగాలని సూచించారు. బీఆర్ఎస్ హయాంలో 6.47 లక్షల రేషన్‌కార్డులు ఇచ్చామని చెప్తుంటే ఒక్క రేషన్‌కార్డు కూడా ఇవ్వలేదని ఎలా అంటారని నిలదీశారు. రేషన్‌కార్డుల పంపిణీ సందర్భంగా నల్లగొండలో గొడవలు కూడా జరిగిన విషయాన్ని గుర్తుచేశారు. మ్యానిఫెస్టోలో దొడ్డువడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పడంపై బీఆర్ఎస్ సభ్యుడు గంగుల కమలాకర్ ప్రశ్నించడాన్ని బుల్డోజ్ చేశారని మండిపడ్డారు. ‘బయట రూ.35, రూ.42కు దొరుకుతున్న సన్న బియ్యాన్ని మీరు టెండర్ పెట్టి రూ.57కు కొనాల్సిన అవసరం ఏమిటి? ఆ టెండరు రద్దు అయిందా? లేదా? అని కమలాకర్ అడిగితే దానికీ సమాధానం ఇవ్వలేదు. సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్లో పారదర్శకంగా టెండర్ పిలిచామని చెప్పారు. టెండర్ వేసిన ఆ నలుగురు ఎవరు? వాళ్లు బియ్యం ఎందుకు సేకరించడం లేదు? డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారు?’ అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఎవరెవరి దగ్గర ఎంతెంత వసూలు చేస్తున్నారో తమ దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయన్నారు. అందుకే హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ‘ఇది చిన్న స్కామ్ కాదు.. రూ.1100 కోట్ల కుంభకోణం మంత్రికి తెలియకుండానే ఈ ప్రభుత్వంలో చాలా జరుగుతున్నాయి. రూ.1100 కోట్ల కుంభకోణంపై తప్పకుండా హౌస్ కమిటీ వేయాలి. మేము చెప్పేంది మీకు రుచించాలని ఏమీ లేదు. కానీ, అధికారం ఉంది కాదా అని బుల్డోజ్ చేస్తామడం సరికాదు’ అని మండిపడ్డారు. ప్రభుత్వం సమాధానం సంతృప్తికరంగా లేదు కాబట్టి సభ నుంచి వాకౌట్ చేస్తున్నామని కేటీఆర్ చెప్పారు.
ప్రభుత్వం నిర్వహించిన ధాన్యం కొనుగోలు టెండర్లలో గోల్మాల్ జరిగిందని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ అంశంపై సభాసంఘం వేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టెండర్లలో క్వింటాలు రూ. 2,007కు కోట్ చేస్తే మిల్లర్ల నుంచి రూ.2,223 వసూలు చేశారని ఆరోపించారు. అదనంగా రూ. 220 చొప్పున వసూలు చేసిన మొత్తం రూ.750 కోట్లు ఎక్కడికి పోయాయో చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం అసెంబ్లీలో బడ్జెట్‌పై పద్దుల చర్చలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ హయాంలో తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా ధాన్యం ఉత్పత్తి, సేకరణ గణనీయంగా పెరిగిందని తెలిపారు. 2020లో కరోనా సమయంలోనూ 1.41 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదని చెప్పారు. ఆ సమయంలో పౌరసరఫరాలశాఖ మంత్రిగా తాను ఉన్నందుకు గర్వపడుతున్నానని పేర్కొన్నారు. 2023-24లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్విచ్ఆఫ్ చేసినట్టు ధాన్యం కొనుగోళ్లు 41లక్షల టన్నులకు పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం, ధాన్యం ఉత్పత్తి గణనీయంగా పెరిగినా మిల్లింగ్ సామర్థ్యం ఆ స్థాయిలో పెరగలేదని గంగుల తెలిపారు. ఈ నేపథ్యంలో మిల్లుల్లో పేరుకుపోతున్న నిల్వలను ఖాళీ చేస్తే కొత్త నిల్వలు పెట్టొచ్చన్న ఉద్దేశంతో ధాన్యం బహిరంగ వేలానికి గ్లోబల్ టెండర్లు పిలిచినట్టు చెప్పారు. రైతులకు క్వింటా ఉత్పత్తికి రూ.2,500 ఖర్చు అవుతుండగా, కంపెనీలు రూ.1800 మాత్రమే ఇస్తామని కోట్ చేయడంతో మరోసారి టెండర్లు పిలిచినట్టు వివరించారు. సరిగ్గా అదే సమయంలో ఎన్నికల కోడ్ రావడంతో కొనుగోలు వద్దని కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు.ఈసీ ఆదేశాలతో టెండర్లు ఓపెన్ చేయలేదని తెలిపారు.
గోదాముల్లో కోటి టన్నుల ధాన్యం నిల్వ ఉంటే తాజాగా ప్రభుత్వం 35 లక్షల టన్నుల ధాన్యానికి మాత్రమే టెండర్లు పిలిచిందని గంగుల గుర్తు చేశారు. నలుగురు కాంట్రాక్టర్లకు మాత్రమే టెండర్లు దక్కేలా ఏర్పాట్లు జరిగాయని అనుమానం వ్యక్తం చేశారు. ఆ నలుగురు ఎవరని, వారి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. 35 లక్షల టన్నులను ఖాళీ చేయాలని టెండర్లకు పిలిస్తే ఇప్పటి వరకు కనీసం 35 కిలోలు కూడా ఖాళీ చేయలేదని మండిపడ్డారు. 35 లక్షల టన్నుల ధాన్యానికి 7 లక్షల టన్నులకు మాత్ర మే డబ్బులు కట్టారని, మిగతా సొమ్ము సర్కారు ఖ జానాకు ఎప్పుడు వస్తుందని ప్రశ్నించారు. ప్రభుత్వం 1.59 లక్షల టన్నుల సన్నవడ్లను పట్టించి హాస్టళ్లకు ఇస్తే కిలోకు రూ.32 నుంచి రూ.33 వరకు ఖర్చయ్యేదని తెలిపారు. మిల్లర్ల నుంచి ప్రభుత్వం రూ.56 కు సన్నబియ్యం కొనుగోలు చేసిందని ధ్వజమెత్తారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఒకవేళ తన హయాంలో తప్పులు జరిగాయని భావిస్తే సభాసంఘం ఏర్పాటుచేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
రూ.450 కోట్ల ఇరిగేషన్ నిధులతో, రూ.100 కోట్ల టూరిజంశాఖ నిధులతో కరీంనగర్లో మానేరు రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టును చేపట్టామని గంగుల తెలిపారు. రూ.470 కోట్లతో రీటెయినింగ్ వాల్స్ నిర్మించగా, మరో రూ.100 కోట్ల పనులు కొనసాగినట్టు చెప్పారు. ప్రభుత్వం మారిన వెంటనే ఆ పనులను నిలిపివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధాన్యం కొనుగోలు విషయంలో గంగుల కమలాకర్ మాట్లాడుతుండగా కాంగ్రెస్ సభ్యులు సభలో అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆయన ‘నేను 2004 నుంచి వరుసగా గెలుచుకుంటూ వచ్చాను. నేనెవర్నీ డిస్ట్రబ్ చేయలేదు..నన్నెవరూ డిస్ట్రబ్ చేయొద్దు. ఏదైనా చెప్పదలచుకుంటే నా ప్రసంగం పూర్తయ్యాక వివరణలో చెప్పండి’ అని సూచించారు.