Ex Minister Koppula | తెలంగాణలో బీజేపీకి ప్రజలు ఎనిమిది మంది ఎంపీలను గెలిపిస్తే.. బీజేపీ ఇచ్చే తొలి రిటర్న్ గిఫ్ట్ ఇదేనా? అంటూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. పెద్దపల్లిలోని తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బొగ్గు గనుల వేలాన్ని అభ్యంతరం చెప్పాల్సిన సీఎం రేవంత్ రెడ్డి మోదీని ఆహ్వానిస్తున్నాడన్నారు. మోదీ తాన అంటే.. రేవంత్ రెడ్డి తందానా అంటున్నాడన్నారు. వేలం వేయడం మంచిదే అని కేంద్రానికి మద్దతు ప్రకటిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ధ్వజమెత్తారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి వేలాన్ని వ్యతిరేకిస్తూ మోదీకి లేఖ రాశారని.. మరి ఇప్పుడు సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ప్రధానికి ఎందుకు లేఖ రాయడం లేదని ప్రశ్నించారు.
బొగ్గు బావుల వేలం వద్దని ఎందుకు విజ్ఞప్తి చేయట్లేదని నిలదీశారు. స్వయంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రేపు వేలం కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని.. వేలంలో పాల్గొనడం అంటే.. బొగ్గు బావుల మీద సింగరేణి హక్కులేదని అని ఒప్పుకోవడమేనన్నారు. సింగరేణికి నేరుగా కోల్‌మైన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. వేలం వేయడం తప్పులేదు అని అంగీకరిస్తున్నారన్నారు. సింగరేణి కార్మిక సంఘాలు కూడా ఈ విషయంలో స్పందించానల్నారు. గుర్తింపు సంఘంగా ఉన్న ఏఐటీయూసీ, ప్రభుత్వం తీరుపై మిత్రపక్షం సీపీఐ నేతలు ఏమంటారో చెప్పాలన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న బొగ్గు నిల్వల కోసం సర్వేలు, కోట్లు ఖర్చుపెట్టి బొగ్గు బ్లాకులను వెలికి తీసిందన్నారు. బొగ్గు రవాణా కోసం కోట్లు ఖర్చు పెట్టి రైల్వే లైన్లు వేసి, అనేక సంవత్సరాల భవిష్యత్తును నిర్ణయించుకున్నటువంటి సింగరేణి అన్నారు. చస్నాల మైనింగ్ విపత్తు 27 డిసెంబర్ 1975న భారతదేశంలోని బీహార్ ( ప్రస్తుతం జార్ఖండ్) రాష్ట్రంలోని ధన్‌బాద్ సమీపంలోని చస్నాలాలోని బొగ్గు గనిలో పేలుడు సంభవించి వరదల కారణంగా 375 మంది మరణించారని.. ప్రైవేటు సంస్థలకు ప్రమాద కారణమైనటువంటి గనులను ఇవ్వకూడదని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.
రక్షణ విషయంలో బొగ్గు గనుల్లో అత్యంత ప్రావీణ్యం కలిగిన సంస్థ సింగరేణి సంస్థ సింగరేణి అన్నారు. సింగరేణిని ప్రైవేటుపరం చేయొద్దని.. వెంటనే వేలం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎఫ్ఆర్బీఎం కోసం రాష్ట్ర ప్రభుత్వం మోకరిల్లిందని.. సింగరేణి బొగ్గు బ్లాకుల వేలానికి పచ్చజెండా ఊపి వారం తిరగక ముందే విద్యుత్తు వ్యవస్థను అదానీ కంపెనీకి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడిందన్నారు. బీఆర్ఎస్కు 16ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రంలో నిర్ణయాత్మకశక్తిగా ఉంటామని కేసీఆర్ చెబితే.. 16 సీట్లతో ఏం చేసుకుంటారని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఏపీలో 16 సీట్లు గెలుచుకున్న టీడీపీ వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుందని.. చెరో 8 స్థానాలు దక్కించుకున్న కాంగ్రెస్, బీజేపీ సింగరేణిని ఖతం చేస్తున్నాయని ఆరోపించారు.