మిర్యాలగూడ, సెప్టెంబర్ 3 : ఆంధ్రప్రదేశ్ పాలకులు కృష్ణా జలాలను అక్రమంగా పోతిరెడ్డిపాడు, వెలిగొండ, సాగర్ కుడికాల్వ ద్వారా అక్రమంగా తరలించుకుపోతుంటే నీటి దోపిడీని అడ్డుకోలేని అసమర్థుడు సీఎం రేవంత్‌రెడ్డి అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం మిర్యాలగూడ ఎన్ఎస్పీ క్యాంప్ గ్రౌండ్లో నిర్వహించిన రైతు మహాధర్నాలో ఆయన మాట్లాడారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో కృష్ణా జలాలను హక్కుగా తెలంగాణకు రావాల్సిన నికర జలాలను వాడుకొని, 17 పర్యాయాలు రైతుల కోసం నీటిని విడుదల చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. గతంలో సాగర్ డెడ్‌స్టోరేజీకి చేరుకున్నప్పుడు కూడా రైతులకు సాగునీరందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని చెప్పారు.
రైతుల ఆవే శం కట్టలు తెగి, డ్యామ్గేట్లు బద్దలు కొట్టే వరకు రైతుల సహనాన్ని పరీక్షించవద్దని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జిల్లా నుంచి మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి, ఉత్తమ్, ఢిల్లీ చుట్టూ తిరుగుతున్న సీఎం రేవంత్‌రెడ్డిపై మిర్యాలగూడ ప్రజలు తమ ఆవేశం చూపించాలన్నారు. మిర్యాలగూడకు కేటీఆర్ వస్తున్నట్టు తెలియగానే హడావుడిగా నీరు వదిలారని జగదీశ్‌రెడ్డి తెలిపారు. సాగునీటి విడుదల విషయంలో రైతులకు అన్యాయం చేస్తున్న సీఎం, నీళ్ల మంత్రి ఉత్తమ్, మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇండ్లముందు మిర్యాలగూడ ఎమ్మెల్యే నిరసన వ్యక్తం చేయాలని డిమాండ్ చేశారు. ఆనాడు కేసీఆర్ కొట్లాడినట్టే ఇప్పుడు కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్రగా దండయాత్ర చేసి సాగునీటిని సాధించుకుందామని కోరారు.