Jagadish Reddy | కేసీఆర్ హరితహారం చేస్తే.. కాంగ్రెస్ హరిత సంహారం చేస్తోందని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హెచ్‌సీయూ వ్యవహారంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరిపై ఆయన నిప్పులు చెరిగారు. సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న జంతువులు చిత్రహింసలకు గురవుతున్నాయని.. తమ బాధ్యత కాకపోయినా విద్యార్థులు పోరాటం చేస్తున్నారన్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే అధికారులతో మాట్లాడి.. పోలీసులను అడ్డుకోవచ్చన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి నాటకం ఆడుతున్నాయని.. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు చిత్తశుద్ధి ఉంటే సెంట్రల్ యూనివర్సిటీలోకి రాకుండా పోలీసులను అడ్డుకోవచ్చన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ అధికారిగా వీసీ ఉంటారని.. డ్రోన్ కేమెరాలతో జేసీబీ వీడియోలు తీస్తే ఐదుగురు విద్యార్థులను అరెస్టు చేశారన్నారు.
బీజేపీ సహాయంతోనే రేవంత్ రెడ్డి 400 ఎకరాల భూమిని తీసుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూములపై రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు ఉంటుందని, పార్కులను, అడవులను ప్రభుత్వం అమ్ముతుందా ? అని ప్రశ్నించారు. సెంట్రల్ యూనివర్సిటీపై రేవంత్ రెడ్డికి హక్కు లేదని.. సెంట్రల్ యూనివర్సిటీలో ఎన్ని ఎకరాలు ఉన్నాయో ఇప్పటి వరకు తెలియదన్నారు. ఫోర్త్ సిటీలో, ఫ్యూచర్ సిటీలో భూమి ఇచ్చుకోవచ్చు కదా? అంటూ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి గురువు లాగా అద్భుతమైన ఫోర్త్ సిటీ కడతామని రేవంత్ రెడ్డి అంటున్నారని.. 400 ఎకరాలు ప్రభుత్వానిది అయితే దొంగల్లాగా అర్ధరాత్రి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. 400 ఎకరాల భూముల్లో ప్రభుత్వ పెద్దల చీకటి కోణం ఉందని.. 400 ఎకరాల భూమిపై చీకటి ఒప్పందం ప్రభుత్వం చేసుకుందని ధ్వజమెత్తారు. ఐటీ పార్కులు ఫోర్త్ సిటీలో ఎందుకు కట్టకూడదు..? చాలా ఐటీ పార్కుల్లో స్థలం ఉందని.. గురువు రియల్ ఎస్టేట్ దందా కోసం భూమిని ప్రైవేటు వాళ్లకు కట్టబెట్టారో ఇప్పుడు శిష్యుడు అదే బాటలో నడుస్తున్నారన్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో మూడు చెరువులు ఉన్నాయని.. హైడ్రా, రంగనాథ్ ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదన్నారు. సేవ్ హెచ్‌సీయూ అనే స్లోగన్‌కు ఐదులక్షల మంది మద్దతు తెలిపారని.. ఐదు లక్షల మంది పేయిడ్ బ్యాచేనా? అంటూ ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్, కేటీఆర్‌పై విషం కక్కడం ఎందుకు…? ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ మద్దతు కోరడం విద్యార్థులు చేసిన తప్పా..? అంటూ నిలదీశారు. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటం రాహుల్ గాంధీకి తెలియడం లేదా..? చెల్లింపుల కోసమే రాహుల్ గాంధీ మాట్లాడటం లేదా..? హెచ్‌సీయూలో జరుగుతున్న మారణకాండను ప్రభుత్వం ఆపాలని డిమాండ్ చేశారు. పదేళ్లలో తాము కోర్టుల్లో ఫైట్ చేయకుండా తీర్పు వచ్చిందా ? అంటూ ప్రశ్నించారు. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏం చేస్తోందని.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న గొప్ప పని ఏంటి..? అని నిలదీశారు. రైతుబంధు పేరు చెప్పి తెచ్చిన రూ.10వేలకోట్ల డబ్బులను కమీషన్లకు వాడుకుంటున్నారని.. మాట్లాడిన వాళ్లంతా గుంట నక్కలేనా..? గుంట నక్కలు అయితే జంతువులు కాదా..? తెలంగాణలో మీ లాంటి గుంట నక్కలు ఉన్నాయన్నారు.