Harish Rao | హైదరాబాద్ : బనకచర్ల ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకించడం లేదు..? అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. బనకచర్ల డీపీఆర్ అప్రైజల్‌పై సీఎం రేవంత్ ఎందుకు స్పందించడం లేదని హరీశ్‌రావు నిలదీశారు. బనకచర్ల ప్రాజెక్టుపై హరీశ్‌రావు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.
బనకచర్ల ప్రాజెక్ట్ టెక్నో ఎకనమిక్ అప్రైజల్ ప్రాసెస్ కొనసాగిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ లేఖ రాశారు. 20 రోజుల కింద సీఆర్ పాటిల్ ఈ లేఖ రాసినా రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు స్పందించలేదు. మన దేశంలో సెంట్రల్ వాటర్ కమిషన్ నిబంధనలు, రాజ్యాంగం పరంగా వరద జలాల మీద డీపీఆర్ అప్రైజల్ జరగదు. కానీ ఏపీ ప్రభుత్వం ఈ వరద జలాల మీద బనకచర్ల డీపీఆర్ అప్రైజల్ సబ్మిట్ చేసింది.. దీనిపై కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి లేఖ రాశారు. మరి రేవంత్ రెడ్డి వరద జలాల మీద డీపీఆర్ అప్రైజల్ సాధ్యం కాదని నిలదీయాలి.. కానీ దీనిపై ఇప్పటి వరకు స్పందించలేదు అని హరీష్ రావు నిలదీశారు.
463 టీఎంసీలు నీళ్లు గోదావరి నుండి కృష్ణా నదికి ఆంధ్రప్రదేశ్ మళ్లిస్తుంది.. మేము ఆల్మట్టిలో 112 టీఎంసీలు ఆపుకుంటామని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. మీరు అనుమతిస్తే మేము కృష్ణా నది నీళ్లు ఆపుకుంటానని చెప్తున్నాడు.. దీని వల్ల తెలంగాణ నష్టపోతుంది. కింద గోదావరి నీళ్లు ఏపీ తీసుకుపోతే.. పైన కృష్ణా నీళ్లు కర్ణాటక తీసుకుపోతే, మన బ్రతుకు ఏం కావాలి అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
ఏపీ 463 టీఎంసీల నీళ్లు మళ్లిస్తే నేను మీద 112 టీఎంసీలు ఆపుకుంటా అని కర్ణాటక అంటుంది.. నేను 74 టీఎంసీలు ఆపుకుంటా అని మహారాష్ట్ర అంటుంది. 112 టీఎంసీలు కర్ణాటక, 74 టీఎంసీలు మహారాష్ట్ర ఆపితే మన పరిస్థితి ఏంది. మాట్లాడితే నల్లమల బిడ్డ అంటాడు.. ఆ నల్లమలను అనుకొని పారే కృష్ణా నదిలో ఆ మహబూబ్ నగర్ జిల్లాకు నష్టం జరిగితే ఎందుకు మాట్లాడటం లేదు. నువ్వు నల్లమల పులివా, పిల్లివా, ఎలుకవా.. ఎందుకు మాట్లాడటం లేదు. పులి అయితే మాట్లాడేవాడివి.. పిల్లివి, ఎలుకవు కాబట్టి మాట్లాడటం లేదు అని హరీశ్‌రావు ఘాటుగా విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం పోలవరంని జాతీయ ప్రాజెక్ట్‌గా గుర్తించినప్పుడు కుడి కాలువ కెపాసిటీ 11,500 క్యూసెక్కులు. ఇప్పుడు కుడి కాలువ కెపాసిటీని 23,000 క్యూసెక్కులు అని అంతకంత పెంచారు. జాతీయ ప్రాజెక్ట్ అని హోదా ఇచ్చాక కెపాసిటీని పెంచి కాలువ తవ్వుతుంటే బీజేపీ పార్టీ ఎలా అనుమతినిచ్చింది. గతంలో కుడి కాలువ కెపాసిటీని 11,500 నుండి 18,000 పెంచినప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ప్రశ్నిస్తే పనులు ఆగిపోయాయి. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కెపాసిటీ 23,000కు పెరిగినా ఎవరు అడ్డుకోలేదు, బిల్లులు రిలీజ్ అయ్యాయని హరీశ్‌రావు తెలిపారు.