Harish Rao | హైదరాబాద్ : రైతు ప్రయోజనాలు పక్కన బెట్టి, ఎరువుల కొరత విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హైడ్రామాకు తెరతీసాయని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. యూరియా కొరత తీర్చడంపై దృష్టి పెట్టడం మానేసి, తమ తప్పు లేదన్నట్లు చేతులు దులుపుకోవడం సిగ్గుచేటన్నారు. ‘దేశంలో యూరియా కొరత లేదని ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం కేంద్రం ఇవ్వడం లేదంటున్నారు. వీరద్దరిలో ఎవరు నిజం? ఎవరు అబద్దం? ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమా? లేక రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వమా’ అని హరీశ్ రావు నిలదీసారు.
దేశ వ్యాప్తంగా 143 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైతే, అందుబాటులో 183 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నాయని, ఇప్పటికే 155 లక్షల మెట్రిక్ టన్నులు విక్రయించామని కేంద్రం ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసారు. ఇదే విధంగా, DAP 45 లక్షల టన్నుల అవసరానికి 49 లక్షల టన్నులు అందుబాటులో ఉన్నాయని, NPK 58 లక్షల టన్నుల అవసరానికి 97 లక్షల టన్నులు అందుబాటులో ఉన్నాయని కేంద్రం తెలిపిందని తెలిపినట్లు గుర్తు చేసారు.
కేంద్ర ప్రభుత్వ గణాంకాలు నిజమైతే, రైతులకు ఎరువులు అందించడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వమే తప్పిదానికి బాధ్యత వహించాలన్నారు. దేశం మొత్తంలో ఎరువుల కొరత లేకపోయినా, తెలంగాణలో మాత్రం రైతులు ఇబ్బందులు పడుతుండటం రేవంత్ సర్కారు నిర్లక్ష్యాన్ని చూపుతుందని విమర్శించారు. రైతులను మోసం చేయడం మానేసి, తక్షణమే అవసరమైన ఎరువులు రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.