కరీంనగర్, జూలై 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కార్పొరేషన్: రేవంత్‌రెడ్డి కండ్లల్లో ఓటమి భయం కనిపిస్తున్నదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని మొలకెత్తనివ్వనంటూ గప్పాలు కొట్టిన రేవంత్, ఇప్పుడు అధికారం శాశ్వతం కాదని, ఎన్టీఆర్, వైఎస్ఆర్లాంటివారే ఓడిపోయారని, ఎవ్వరికీ ఎప్పుడూ అధికారం శాశ్వతం కాదంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శించారు. ఆయన తీరు చూస్తే ఓటమిని ఒప్పుకోవడంతోపాటు మళ్లీ బీఆర్ఎస్ గెలుపు ఖాయమని సంకేతాలు ఇస్తున్నట్టు స్పష్టమవుతున్నదని చెప్పారు. రుణమాఫీపై వేములవాడ రాజన్న సాక్షిగా ప్రమాణంచేసి మాటతప్పడంతోపాటు రూ.30 వేల కోట్ల రైతుబంధు ఎగ్గొట్టిన కాంగ్రెస్ సర్కార్‌ను రైతులు కాగడాలు పట్టుకొని మరీ తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన బీఆర్ఎస్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన హరీశ్‌రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ చచ్చిపోయిందని, ఫాంమ్హౌస్కు పోయిందన్న రేవంత్ ఇప్పుడు.. మళ్లీ బీఆర్ఎస్ గెలిచినా ఏమీ చేయలేదు అని అంటున్నాడంటేనే ఆయనకు తన వైఫల్యాలు అర్థమయ్యాయని అన్నారు. అందుకే ఇప్పుడు రైతులను ప్రాధేయపడుతున్నాడని, కంచె వేసి తనను కాపాడుకోవాలని కోరుతున్నాడని ఎద్దేవా చేశారు. అసలు రైతులకు ఏం చేశావని కాపాడుకోవాలని ప్రశ్నించారు. మూడుసార్లు రైతుబంధు రూ.30 వేల కోట్లు ఎగ్గొట్టినందుకు, బోనస్‌ను బోగస్ చేసినందుకు, యూరియా కోసం యాప్ పెట్టి గోస పెడుతున్నందుకు కాపాడుకోవాలా..? అని నిలదీశారు. రాష్ట్రంలో 7,600 మంది రైతులకు బీమా డబ్బులు అందకుండా పోయాయని విమర్శించారు. రైతులకు ఐదు కిలోల తరుగు లేకుండా ఎక్కడైనా ధాన్యం కొనుగోలు జరిగిందా? అని ప్రశ్నించారు. ఎంత ప్రాధేయపడ్డా.. ఎన్ని కథలు చెప్పినా రైతులు నమ్మే పరిస్థితి లేదన్నారు. వేములవాడ రాజేశ్వరస్వామి మీద ఒట్టు వేసి రైతు రుణమాఫీ విషయంలో మాట తప్పారని, అదేరోజు రేవంత్‌రెడ్డికి మూడిందని అన్నారు. ఇప్పుడు దేవుడు కూడా క్షమించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. కేసీఆర్‌ను పట్టుకొని పశుపతి అని విమర్శలు చేస్తున్నారని, నేపాల్‌లో హిందువులందరు పూజించుకునే పశుపతి ఆలయం అంటే పశువులు, సమస్త జీవకోటిని కాపాడుకునే శివుడి ప్రతిరూపం పశుపతినాథుడని హరీశ్‌రావు పేర్కొన్నారు. రైతులను, పాడిని కాపాడిన కేసీఆర్ ‘పశుపతి’ అయితే.. రాష్ర్టాన్ని ఆగం చేస్తున్న రేవంత్‌రెడ్డి ఒక బూతుపతి అని విమర్శించారు.
చిత్తశుద్ధి ఉంటే నీటిని ఎత్తిపోయండి
తుంగభద్రలో గేట్లు చెడిపోతే కర్ణాటక రాష్ట్రంలో రెండేండ్లలోనే మరమ్మతులు చేశారని, మేడిగడ్డలో రెండు పిల్లర్లు బాగు చేయడానికి రెండున్నరేండ్లు సరిపోలేదా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు బాగున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్తున్నదని, రెండు పిల్లర్లు బాగు చేస్తే ప్రస్తుతం మిడ్ మానేరు, లోయర్ మానేరుకు నీళ్లు తీసుకొచ్చి నింపుకొనే అవకాశం ఉండేది కదా అని పేర్కొన్నారు. ఎల్‌నినోను ప్రకృతి తీసుకువస్తే.. మనకు 2023 డిసెంబర్ 7న రేవంత్‌రెడ్డి రూపంలో రాష్ర్టానికి ఎల్‌నినో వచ్చిందని ఘాటుగా విమర్శించారు. ఈ ఎల్‌నినోను ప్రజలే తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. తమ్మిడిహట్టి కట్టి సుందిళ్ల బ్యారేజ్‌కు నీళ్లు తెస్తామంటున్నారని, సుందిళ్ల ఓకే అయితే అన్నారం బాగుంటుందని, ఈ మూడు బరాజులు కట్టింది ఒకే ప్రభుత్వం అనే విషయాన్ని గుర్తించాలని అన్నారు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలో తాగు సాగునీరు కావాలంటే.. అది కాళేశ్వరం ద్వారానే సాధ్యమవుతుందని స్పష్టంచేశారు. ఇప్పటికైనా రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధితోపాటు ప్రజలపై ప్రేమ ఉంటే కన్నెపల్లి పంపులు ఆన్ చేసి మిడ్ మానేరుకు నీళ్లు తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలాగే ఎల్లంపల్లి నుంచి ఎస్సారెస్పీకి నీటిని పంపింగ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి ఎన్ని చేసినా మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని చెప్పారు. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కొద్దిగా పనిచేస్తే ప్రభుత్వం రావడం ఖాయమని అన్నారు. బీఆర్ఎస్కు, కరీంనగర్ గడ్డకు విడదీయరాని పేగుబంధం ఉన్నదని గుర్తుచేశారు.
ప్రతి ఓటరు ‘సర్’పై జాగ్రత్తగా ఉండాలి
ప్రతి ఓటరూ సర్ ప్రక్రియపై జాగ్రత్తగా ఉండాలని హరీశ్‌రావు సూచించారు. ఇతర రాష్ర్టాల్లో ప్రతిపక్షాల ఓట్లు తొలగిస్తున్నట్టుగానే ఇక్కడ కూడా రెండు ప్రభుత్వాలు కుట్రలు చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బూత్ లెవెల్ ఏజెంట్లకు సహాయం చేయడానికి, అనుమానాలు నివృత్తి చేయడానికి ఎన్నికల కమిషన్ ప్రతి నియోజకవర్గానికీ, జిల్లాకు ప్రత్యేక అధికారులను, కాల్ సెంటర్లను ఏర్పాటు చేసిందని, వారి సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో తన క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజూ 20 బూత్‌ల ఏజెంట్లతో ప్రత్యేక సమీక్ష సమావేశాలు జరుగుతున్నాయని, ఏ బూత్‌లో ఎంత పని జరిగిందన్న విషయాన్ని ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నారని అభినందించారు. పార్టీకి కండ్లు, చెవులు బూత్ ఏజెంట్లేనని, రాజకీయాల్లో ఎదగడానికి ఇది తొలి మెట్టు అని, గతంలో బూత్ ఏజెంట్లుగా కష్టపడి పనిచేసిన వారే సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లుగా విజయం సాధించారని చెప్పారు. బూత్ ఏజెంట్లు పర్ఫెక్ట్గా పనిచేస్తే రోబోయే ఏ ఎన్నికల్లోనైనా బీఆర్ఎస్ పార్టీకి ఘన విజయం తథ్యమని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, బీఆర్ఎస్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, కొండూరు రవీందర్రావు, జిల్లా అధ్యక్షడు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షడు చల్లా హరిశంకర్, మాజీ మేయర్ రవీందర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ హయాంలోనే నీళ్లు లేక రైతుల అవస్థలు: గంగుల
కాంగ్రెస్ ప్రభుత్వంలో సాగునీళ్లు అందక రైతులు నార్లువేసే పరిస్థితి లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆవేదన చెందారు. కేసీఆర్ హయాంలో కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోస్తే నియోజకవర్గంలోని చెరువులన్నీ నిండటంతో పంట పొలాలు కళకళలాడేవని పేర్కొన్నారు. రైతులను ప్రశ్నిస్తే నీళ్లు లేవని, వరినారు వేసే పరిస్థితి లేదని చెప్తున్నారని చెప్పారు. రైతులకు వెంటనే నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తే ప్రభుత్వంలో సోయి లేకుండా పోయిందని విమర్శించారు. ప్రభుత్వానికి చేతకాకపోతే కన్నెపల్లి పంపులను బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆన్ చేసుకొని రైతులకు నీళ్లు ఇస్తామని స్పష్టం చేశారు. నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేస్తే ఇప్పటివరకు కేసు లేదని, ఏదో చుట్టపు చూపుగా పిలిపించి పంపించారని విమర్శించారు. నగరం నడి మధ్యలో జ్యువెల్లరీ షాపుల్లో దొంగతనం జరిగితే స్పందన కరువైందని మండిపడ్డారు. కరీంనగర్ మండలంలో హనుమాన్ విగ్రహాన్ని దొంగతనం చేస్తే కేసు లేదు కానీ, తాము ఆ విగ్రహాన్ని తీసుకువస్తే తమపై కేసులు పెట్టారని విమర్శించారు.