Harish Rao | సిద్దిపేట : కాంగ్రెస్ చేతగానితనం, నిర్లక్ష్యం వల్ల కేంద్రంలో ఉన్న బీజేపీ పక్షపాత ధోరణి వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతున్నది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డికి కేంద్రాన్ని ఎదిరించే దైర్యం లేదు, చంద్రబాబును ప్రశ్నించే దమ్ము లేదు అని హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేటలో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ నీటి హక్కుల రక్షణ కోసం కేసీఆర్ ప్రాజెక్టులు కడితే.. రేవంత్ అసమర్ధత, చంద్రబాబు కుట్రలతో కేంద్రంలోని బీజేపీ ఆ ప్రాజెక్టుల డీపీఆర్‌లను వెనక్కి పంపింది. నిన్న చంద్రబాబు “కాళేశ్వరం మంచిది.. నేను కాళేశ్వరం ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేయలేదు” అని అన్నారు. అయితే, 2018 జూన్ 13న చంద్రబాబు కేంద్రానికి రాసిన లేఖలో “కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వడం పట్ల తీవ్రమైన విచారం వ్యక్తం చేస్తున్నాం” అని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు “కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకోలేదని” అంటున్నారు అని హరీశ్‌రావు తెలిపారు.
ఒక్క కాళేశ్వరమే కాదు, వారు దత్తత తీసుకున్న పాలమూరు జిల్లాలో కల్వకుర్తి నీటి కేటాయింపులు పెంచితే దాన్ని వ్యతిరేకిస్తూ లేఖ రాసారు. పాలమూరు ఎత్తి పోతల, డిండి ఎత్తిపోతల పథకాలను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు లేఖ రాసారు. చంద్రబాబు సీఎం కాగానే తెలంగాణకు చెందిన ఒక్కో ప్రాజెక్టు డీపీఆర్‌లు కేంద్రం నుంచి వాపస్ వస్తున్నాయి. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం, చంద్రబాబు కేంద్రంలో తన పలుకుబడి ఉపయోగించి డీపీఆర్‌లు వాపస్ వచ్చేలా చేసిండు. రేవంత్ రెడ్డికి బీజేపీని ప్రశ్నించే తెగువ లేదు, తెలివి లేదు. ఈయన చంద్రబాబును ఎదిరించి ప్రాజెక్టులు సాధిస్తారా, అక్రమ ప్రాజెక్టులను ఆపగలుగుతాడా? అని రేవంత్ రెడ్డిని హరీశ్‌రావు ప్రశ్నించారు.