Harish Rao | సిద్దిపేట : రాష్ట్రంలో ఎంత స్పీడ్‌గా కాంగ్రెస్ పార్టీ గెలిచిందో.. అంతే స్పీడ్‌గా ఓడిపోయిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. గజ్వేల్ పట్టణంలోని శోభా గార్డెన్లో బీఆర్ఎస్ నాయకులతో మాజీ మంత్రి హరీశ్‌రావు సమావేశమై బీఆర్ఎస్ రజతోత్సవ సభపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో పెద్ద మీటింగ్‌లు పెట్టలేదు ఎలక్షన్లలో తప్ప. ఇప్పుడు పెట్టే ఈ మీటింగ్ ప్రతిష్టాత్మకమైనది. ప్రతి నియోజకవర్గం నుండి కార్యకర్తలు స్వచ్ఛందంగా వస్తామని అంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుండి లక్ష మంది హాజరు కావాలి అని హరీశ్ రావు పిలుపునిచ్చారు.
రేవంత్ రెడ్డి పాలనలో వ్యాపారాలు పూర్తిగా నడవడం లేదు. ఏ వ్యాపారిని అడిగినా వ్యాపారం లేదు అంటున్నారు. రేవంత్ పాలనపట్ల ప్రజలు విసిగిపోయారు. ఒక మండలంలో చూస్తే 5,100 మందికి రుణమాఫీ అయితే 7,300 మందికి రుణ మాఫీ కాలేదు. గజ్వేల్‌లో ప్రతి కులానికి ఏదో విధంగా బీఆర్ఎస్ పాలనలో న్యాయం చేశామని హరీశ్‌రావు గుర్తు చేశారు.
లోకల్ బాడీ ఎన్నికలలో బీఆర్ఎస్కు లాభం అవుతుంది. నాయకులు సమావేశానికి కార్లలో కాకుండా కార్యకర్తలతో బస్సులో రావాలి. సభకు వచ్చిన కార్యకర్తలను ఇంటికి చేర్చే వరకు నాయకులు జాగ్రత్త తీసుకోవాలి. మహిళా నాయకులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశాం. వచ్చిన ప్రతి కార్యకర్త సభకు హాజరుకావాల్సిందే. నాయకులు మండలాల వారీగా సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. నాయకులు పనిచేస్తే లోకల్ బాడీ ఎన్నికల్లో మనమే గెలుస్తాం. గజ్వేల్ నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీలు గెలుస్తాం అని హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పాలనలో ఇండ్లు, షాపులు కిరాయికి దొరికేవి కావు. ఇప్పుడు ఎక్కడ చూసినా టూ లెట్ బోర్డులు కనపడుతున్నాయి. దేవుడిపై ఒట్టు పెట్టి దేవుణ్ణే మోసం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. అటు అసెంబ్లీలో ఇటు బయట ఎక్కడైనా అబద్ధాలు చెప్తాడు. యంగ్ ఇండియా స్కూల్ నా బ్రాండ్ అని రేవంత్ అన్నాడు. ఇచ్చిన హామీలు ఎగ్గొట్టుడు, అబద్ధాలు చెప్పుడు, చెట్లు నరకుడు ఇవి రేవంత్ రెడ్డి బ్రాండ్స్. చెట్లు పెట్టే వంతు కేసీఆర్‌ది అయితే చెట్లు నరకుడు రేవంత్ రెడ్డి వంతు. ఎకరాలకు ఎకరాలు చెట్లు నరికిస్తున్నాడు.
రైతులు చెట్లు నరికితే కేసులు పెడతారు. మరి 400 ఎకరాలలో చెట్లు నరికితే రేవంత్ రెడ్డిపై కేసు పెట్టరా. 170 కోట్ల లంచం ఇచ్చి అప్పులు తెచ్చింది రేవంత్ రెడ్డి. 400 ఎకరాల భూమి కుదవ పెట్టి 10 వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. అడిగితే కుదవ పెట్టలేదు అంటున్నారు. సమాచార హక్కు చట్టం ప్రకారం అప్లికేషన్ పెట్టానని హరీశ్‌రావు తెలిపారు.
రేవంత్ రెడ్డి వల్ల అధికారులు బలయ్యే పరిస్థితి వచ్చింది. జాకీలు పెట్టి లేపినా కాంగ్రెస్ పార్టీ లేచే పరిస్థితి లేదు. గ్రామాలలో సన్న బియ్యం ఇస్తున్నారు అందులో 40 శాతం నూకలే. నూకలు లేకుండా గురుకులాలకు ఏ విధంగా కేసీఆర్ సన్న బియ్యం ఇచ్చారో అదే విధంగా ఇవ్వండి. వడ్లు కొనమని అడిగితే నూకలు బుక్కండి అన్నది బిజెపి ప్రభుత్వం. నూకలు ఉన్న బియ్యం ప్రజలకు ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం. 14 వేల కోట్ల రూపాయల రైతు బంధు ఎగ్గొట్టి అసంపూర్తిగా రుణ మాఫీ చేసిండు. కేసీఆర్ ప్రభుత్వంలో కరోనా కాలంలో కూడా రైతు బంధు ఇచ్చాడు. కాంట్రాక్టర్ లకు బిల్లు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. నేడు కాంట్రాక్టర్ లను ఇబ్బంది పెడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. సెక్రటేరియట్ లో కాంట్రాక్టర్లు ధర్నా చేస్తున్నారు. కష్టపడ్డ కార్యకర్తలను గెలిపించుకుందాం అని హరీశ్‌రావు పేర్కొన్నారు.