Harish Rao | సంగారెడ్డి : రేవంత్ రెడ్డికి కేసీఆర్ చేసిన అభివృద్ది కనపడటం లేదంటే.. ఆయన అంధుడు అయిన ఉండాలే.. లేదంటే పిచ్చోడు అయిన ఉండాలి అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పిచ్చోడు అయితే జూబ్లీహిల్స్ ప్రజలు ఎర్రగడ్డలో చేర్చాలి అని హరీశ్‌రావు సూచించారు.
పటాన్చెరు నియోజకవర్గంలోని కొల్లూరు కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూం కాలనీవాసుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు. నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడికి వస్తే కుర్చీలు ఖాళీ ఉన్నాయి. మన మీటింగ్‌కు మూడుసార్లు కుర్చీలు తెప్పించిన సరిపోవడం లేదు. కొల్లూరు డబుల్ బెడ్రూమ్స్కు పేరు కేసీఆర్ నగర్ అనే పేరు పెట్టుకున్నాం.
ఇన్ని ఇళ్లు చూసి అబ్బ కేసీఆర్ ఇంత పెద్ద ఇల్లు కట్టాడా? అని ఆశ్చర్య పోయారట. ఇన్ని రోజులు మంత్రులు వచ్చారా? అని హరీశ్‌రావు నిలదీశారు.
మాగంటి గోపీనాథ్ భార్య కన్నీళ్లు పెట్టుకుంటే కాంగ్రెస్ నాయకులు దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. మీ కాంగ్రెస్ వాళ్ళు చనిపోతే భార్యలు ఏడుస్తారా లేదా? ఆ తల్లిని పట్టుకుని దుర్మార్గంగా మాట్లాడారు. ఆలోచన చేయండి.. సిగ్గు లేకుండా ఓట్లు అడుగుతున్నారు. అది ఇస్తాం, ఇది ఇస్తాం అని ప్రలోభాలు చేస్తున్నారు. అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోతమా? కలలో కూడా కలగనని ఇళ్లలో ఉంటామని అనుకోలేదు. మీ ఓట్లు ఖాయంగా కేసీఆర్‌కే అని అర్థమైంది. మీ బంధువులకు కూడా చెప్పి కేసీఆర్‌కు కారుకు ఓటేయమ్మని చెప్పండి అని హరీశ్‌రావు కోరారు.
ఈ ఎన్నికలు రెఫరెండం అని చెప్పే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదు. మంత్రులు జూపల్లి కృష్ణారావుకు, పొన్నం ప్రభాకర్‌కు జూబ్లీహిల్స్ ఓటర్లు చుక్కలు చూపించారు. ఓటుకు రూ.3వేలు ఇస్తామని కాంగ్రెస్ చెబుతున్నది. తీసుకుని మిగతా రెండేళ్లలో ఇస్తామన్న డబ్బులు కూడా అడగండి. 2,500 లేదు, మహాలక్ష్మి స్కీమ్ లేదు, తులం బంగారం లేదు, స్కూటీ లేదు.. సిగ్గు లేకుండా మళ్ళీ ఏదో చేస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నాడు. తులం బంగారం అడిగితే ఓ మంత్రి లక్ష దాటింది ఎక్కడ ఇస్తాం అని మాట్లాడుతున్నాడు. మరి అలాంటప్పుడు హామీ ఎందుకు ఇచ్చారు బిడ్డా. కల్యాణలక్ష్మీ, కేసీఆర్ కిట్ ఇచ్చాము.. రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో ఒక్క ఇల్లు కూడా కట్టలేదు.. గతంలో కిరాయి ఇళ్లలో ఏ పనులు కూడా చేసుకోలేని దుస్థితి ఉండేది. ఆత్మగౌరవంతో కేసీఆర్ పెద్ద ఎత్తున ఇల్లు కట్టించాడు.. రేవంత్ రెడ్డి ఇల్లు కట్టకపోగా ఉన్న ఇండ్లను కూల్చాడు అని హరీశ్‌రావు మండిపడ్డారు.
కేసీఆర్ ముస్లింలను మోసం చేయలేదు.. సహాయం చేశాడు. ముస్లింలు సహాయం చేసిన వారిని జీవితంలో మర్చిపోరు.. హిందూ అయిన ముస్లిం అయిన కేసీఆర్‌కు ఒక్కటే.. బతుకమ్మ చీరలు మాత్రం ఇవ్వలేదు కానీ రేవంత్ వచ్చాక అన్ని ధరలు పెంచాడు. సీఎం రేవంత్ రెడ్డి ధరలు పెంచి, కమీషన్లు దండుకున్నాడు. కాంగ్రెస్ లేకపోతే ముస్లిం లేరు అని రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై యావత్ తెలంగాణ ముస్లింలకు క్షమాపణ చెప్పాలి.. జహీరాబాద్ మైనార్టీ విద్యార్థుల్లో ఆటో డ్రైవర్ బిడ్డ ఉంది.. మీ అందరికీ ఇండ్లు ఇచ్చిన కేసీఆర్‌ను మర్చిపోవద్దు.. 11వ తేదీన జరిగే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు గుద్దితే.. కాంగ్రెస్ వాళ్లు కనుమరుగు కావాలే అని హరీశ్‌రావు అన్నారు.