Harish Rao | హైదరాబాద్ : విద్యా శాఖ మంత్రిగా, మున్సిపల్ మంత్రిగా, హోం మంత్రిగా, ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యాడని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రంగా విమర్శించారు. కలెక్షన్ల మంత్రిగా, వసూళ్ల మంత్రిగా మాత్రం పాస్ అయిపోయిండు అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడారు.
జీవో 29, జీవో 55పై నేను ఆనాడు అసెంబ్లీలో గట్టిగా మాట్లాడాను. భట్టి గారు దళిత మంత్రిగా ఉన్నారు మీరైనా పట్టించుకోండి అంటే పట్టించుకోలేదు. జాబులు నింపండి అంటే జేబులు నింపుకుంటున్నరు. గల్లా పెట్టెలు నింపుకుంటున్నరు. విద్య రాని వ్యక్తి విద్య శాఖ మంత్రి. అతి ఎక్కువ క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తి హోం మంత్రిగా ఉన్నారని హరీశ్‌రావు విమర్శించారు.
మా ప్రభుత్వం టీఎస్ ఐపాస్ ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించింది. నేడు ఈ ప్రభుత్వం మంత్రులు, ముఖ్యమంత్రి గన్నులు పెట్టి బెదిరిస్తున్నరు. రేవంత్ రెడ్డి గన్ ఇచ్చి పంపించాడు అని మంత్రి కుమార్తె చెప్పింది. ఐఏఎస్ ఆఫీసర్ వీఆర్ఎస్తో మధ్యలోనే వెళ్లిపోతున్నడు. లక్షా 64వేల ప్రభుత్వ ఉద్యోగాలను బిఆర్ఎస్ ఇచ్చింది. గ్రూప్ 1, గ్రూప్ 2 ఆలస్యం అయ్యింది.
95 శాతం లోకల్ రిజర్వేషన్ సాధించాం. నోటిఫికేషన్లు ఇచ్చింది బిఆర్ఎస్, పరీక్ష పెట్టింది బిఆర్ఎస్, ఫిజికల్ టెస్టు పెట్టింది బిఆర్ఎస్, ఎంపిక చేసింది బిఆర్ఎస్. నియామకపత్రాలు ఇచ్చింది రేవంత్. దీంతో 60వేల ఉద్యోగాలు ఇచ్చినా అని ప్రచారం చేసుకుంటున్నడు రేవంత్ రెడ్డి అని హరీశ్‌రావు మండిపడ్డారు.
అందులో 15400 ఎస్సై కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చింది బిఆర్ఎస్. 9 వేల గురుకులాల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చింది బిఆర్ఎస్. 8 వేల గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇచ్చింది బిఆర్ఎస్. హెల్త్ డిపార్టుమెంట్లో 7 వేల ఉద్యోగాలు ఇచ్చింది బిఆర్ఎస్. జేఎల్ 1300, ఆరు వేల టీచర్ల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది బిఆర్ఎస్. అచ్చంగా కాంగ్రెస్ నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసింది కేవలం 10 వేల ఉద్యోగాలు మాత్రమే అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మేం హామి ఇస్తున్నాం. అసెంబ్లీ వేదికగా మీకోసం పోరాటం చేస్తం. మొన్న అడిగితే ఒక్కటే నాడు అసెంబ్లీ పెట్టి పారిపోయిండు. అసెంబ్లీ పెట్టడానికి కూడా భయమే. జెన్కో, జీపీవో, పోలీసు, డిప్యూటీ సర్వేయర్, ఇతర గ్రూప్స్ నోటిఫికేషన్ల కోసం బిఆర్ఎస్ పోరాటం చేస్తుంది. అన్ని జిల్లా కేంద్రంలో బాకీ కార్డులు పెట్టి యువతను ఏకం చేస్తం. ప్రత్యక్ష పోరాటం బిఆర్ఎస్ చేస్తుంది. మీకు అండగా ఉంటది అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.