Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్ వద్ద వ్యంగం తప్ప పరిపాలన వ్యవహారం లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఊపిరి ఉన్నంతవరకు సిద్దిపేట అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. సిద్దిపేటను ఓర్వలేక ఇక్కడి అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని.. అసెంబ్లీలో కొట్లాడి సిద్దిపేట అభివృద్ధిని కొనసాగిస్తానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పక్షాల మీద దాడులు, కక్ష సాధింపులకు పాల్పడుతుందని.. హామీల అమలు లేదు.. పరిపాలనపై పట్టింపులేదని మండిపడ్డారు. అరచేతిలో వైకుంఠం చూపించి.. అధికారంలోకి రాగానే పాలనను కాంగ్రెస్ ఆగం చేస్తుందని విమర్శించారు.
ఆపదలో పార్టీ పక్షాన ఆదుకునేందుకు వెళ్తే ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ పార్టీ దాడులకు పాల్పడిందని ఆరోపించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. పాలు, నీళ్లు ప్రజలే తేలుస్తారన్నారు. రైతు రుణమాఫీ సగం చేసి చేతి ముడుచుకున్నాడని.. వానాకాలం ఐపోతున్నా రైతుబంధు లేదన్నారు. అవ్వాతాతలకు, వికలాంగులకు పెన్షన్ ఇవ్వక కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేస్తుందని మండిపడ్డారు. ప్రజలు కష్టాల్లో, ఆపదల్లో ప్రైవేట్ హాస్పిటల్లో ఖరీదైన వైద్యం పొందితే కొంత మొత్తాన్ని ఉడతాభక్తిగా సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం చేసేవాళ్లమని.. ఇందుకు తమ వంతు కృషి చేసిన స్థానిక కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, కేసీఆర్ నాయకత్వంలో సిద్దిపేటను తెలంగాణాలోనే బెస్ట్ నియోజకవర్గంగా అందరి సహకారంతో అభివృద్ధి చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 9నెలల కాలంలో అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని.. కేసీఆర్ ఆశీర్వాదంతో రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా సిద్దిపేట తీర్చిదిద్దుకున్నామన్నారు.
పదేళ్లలో సిద్దిపేట రూపురేఖలు మార్చుకున్నామని.. సిద్దిపేటలో అనేక విద్యాలయాలు తెచ్చుకున్నామని.. సిద్దిపేటకు మెడికల్ కాలేజ్, మహిళా డిగ్రీ కళాశాల, వెటర్నరీ కాలేజీలను సాధించుకున్నామన్నారు. సిద్దిపేటలో విద్యార్థులకు అన్ని రకాల చదువులు అందాలనే ఉద్దేశంతో సిద్దిపేటకు అనేక విద్యాలయాలు తెచ్చామన్నారు. ఇందులో సగం నిర్మాణం పూర్తయిన వెటర్నరీ కాలేజీని కాంగ్రెస్ ప్రభుత్వం కొడంగల్‌కు తరలించుకుపోయిందని ధ్వజమెత్తారు. కొడంగల్‌కు అవసరమైతే కొత్త కాలేజీని నిర్మించుకోవాలని.. సిద్దిపేటకు అన్యాయం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రూ.150కోట్లతో నిర్మిస్తున్న వెటర్నరీ కాలేజీని గద్దలా తన్నుకుపోతున్న సీఎం రేవంత్ రెడ్డి తీరును ప్రజలు గమనించాలని కోరుతున్నానన్నారు. 9 నెలలు అయింది కోమటి చెరువు దగ్గర శిల్పారామం పనులు ఆగిపోయాయని.. పనులు కాకుండా అడ్డుకుంటున్నారన్నారు. అసెంబ్లీలో కొట్లాడి సిద్దిపేటకు రావాల్సిన పనులను హక్కుగా తీసుకొని వస్తానని.. తన ఊపిరి ఉన్నంతవరకు సిద్దిపేట అభివృద్ధి కోసం కృషి చేస్తానని హరీశ్‌రావు స్పష్టం చేశారు.