Harish Rao | హైదరాబాద్ : తెలంగాణలో ఎంబీబీఎస్, బీహెచ్ఎంఎస్/బీఏఎంఎస్ చేసినవారికి స్థానిక కోటా పరిధిలోనే పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించాల్సి ఉంటుందని హైకోర్టు తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పందించారు.
మెడికల్ విద్యార్థులకు జరిగిన నష్టానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. మెడికల్ అడ్మిషన్లలో కాంగ్రెస్ ప్రభుత్వం లోకల్ కోటా నిబంధనలు స్థానికుల అవకాశాలను దెబ్బ తీస్తాయని మేము ఆనాడే చెప్పాం. ఈ రోజు కాంగ్రెస్ తెచ్చిన లోకల్ కోట నియమాలను హైకోర్ట్ రద్దు చేసింది. ఎంబీబీఎస్ అడ్మిషన్లు ఆ తప్పుడు నియమాలతో జరిగినందు వలన వందల మంది స్థానిక అభ్యర్థులకు నష్టం జరిగింది అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
రాష్ట్రం వెలుపల చదివిన, ఇన్‌సర్వీసు అభ్యర్థులకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం అడ్మిషన్లు కల్పించాలని హైకోర్టు స్పష్టం చేసింది. పీజీ మెడికల్, పీజీ (ఆయుష్) అడ్మిషన్ల నిబంధనలు 2021లోని నిబంధన 8కి సవరణ తీసుకువస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 148, 149లను కొట్టివేస్తూ మంగళవారం 106 పేజీల తీర్పును వెలువరించింది. ప్రభుత్వానికి నిబంధనలు తీసుకురావడంతోపాటు వాటిని సవరించే అధికారం ఉందని, అయితే అది చట్టానికి అనుగుణంగా ఉండాలని పేరొంది. తెలంగాణలో విద్యకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లోనే ఉన్నాయని తేల్చి చెప్పింది.
స్థానిక కోటాకు పీజీ మెడికల్, పీజీ (ఆయుష్) అడ్మిషన్లకు సంబంధించి 2021 పీజీ మెడికల్ అడ్మిషన్ల నిబంధన-8కి సవరణ తీసుకువస్తూ ప్రభుత్వం అక్టోబరు 28న తీసుకువచ్చిన జీవో 148, 149లను సవాలు చేస్తూ దాదాపు 98 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై సుదీర్ఘంగా విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించడంగానీ, రద్దు చేయడంగానీ చేయలేదని అందువల్ల అన్వయించుకున్నట్టు భావించాలని ధర్మాసనం పేరొంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 95 నేపథ్యంలో తెలంగాణలో రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తించవన్న వాదన అంగీకారయోగ్యం కాదని స్పష్టం చేసింది. అందువల్ల చదువులకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు తెలంగాణకు వర్తిస్తాయని స్పష్టం చేసింది.