Harish Rao | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే పోలీసులు లేకుండా ఒక్కసారి అశోక్‌నగర్, చిక్కడపల్లి లైబ్రరీకి రావాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సవాల్ విసిరారు. బట్టలూడదీసి ఊడగొడుతారు అని హరీశ్‌రావు హెచ్చరించారు. కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడారు.
ఇచ్చిన మాట నిలుపుకో అని బాకీ కార్డులు రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాయి. ఎన్నికల ముందు వేడుకున్నడు, వాడుకున్నడు. అధికారంలోకి వచ్చాక వదిలేసారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లతో అశోక్ నగర్, సరూర్ నగర్ స్టేడియంలో మీటింగులు పెట్టించారు. ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అని మాయ మాటలు చెప్పారు. మోసం చేసారు అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు గానీ, రెండు నెలల ముందే మద్యం నోటిఫికేషన్లు ఇచ్చిండు. జాబ్ క్యాలెండర్ అని జాబ్ లెస్ క్యాలెండర్ విడుదల చేసారు. జాబ్ క్యాలెండర్లో చెప్పినట్లు ఒక్క నోటిఫికేషన్ అయినా ఇచ్చారా రేవంత్ రెడ్డి. 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ బోగస్. రాజీవ్ యువ వికాసం వికసించకముందే వాడిపోయింది. జూన్ 2 నాడు 5 లక్షల మంది నిరుద్యోగులకు యువ వికాసం కింద సాయం చేస్తం అన్నడు. మాటలు బోగస్ హామీలు బోగస్ అయ్యాయని హరీశ్‌రావు మండిపడ్డారు.
అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిండు. రేవంత్ రెడ్డి కళ్లు తెరిపించేందుకు మీ చేతిలో అవకాశం ఉంది. కొంతమంది నిరుద్యోగులు కూడా నామినేషన్లు వేసారు. కాంగ్రెస్ పార్టీని చిత్తుగా జూబ్లిహిల్స్‌లో ఓడించాలె. ఆనాడు కాంగ్రెస్‌ను గెలిపించేందుకు బస్సు యాత్ర చేసారు. కాంగ్రెస్‌కు సురుకు పుట్టాలంటే జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు నిరుద్యోగులు దండు కట్టాలె. నిరుద్యోగ యువకులే కాంగ్రెస్‌ను ఓడించారనే విషయం రాహుల్ గాంధీకి అర్థం కావాలె. తనతప్పు తాను తెలుసుకునేందుకు మనం కాంగ్రెస్‌ను ఓడించాలె అని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.