Harish Rao | సిద్దిపేట : ఆరు రోజుల్లో 18 మంది చిన్నారులకు విజయవంతంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించడంతో సత్యసాయి ఆస్పత్రి సేవలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశంసల వర్షం కురిపించారు. చిన్న వయసులోనే తీవ్రమైన గుండె సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు ఉచిత చికిత్సలు అందిస్తూ పేద కుటుంబాలకు ఆశాజ్యోతిగా నిలుస్తున్న ఆస్పత్రి సేవలను కొనియాడారు. కొండపాకలోని సత్యసాయి సంజీవని ఆస్పత్రిని హరీశ్ రావు శనివారం సందర్శించారు.
ఈ సందర్బంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. సత్యసాయి ఆస్పత్రి సేవలను దేశంలోని 10వేల గ్రామాల్లోని చిన్నారులకే కాకుండా, 18 ఇతర దేశాల్లోని పిల్లలకు కూడా అందుబాటులో ఉన్నాయి. గత 12 ఏళ్లలో 33,600 మందికి పైగా చిన్నారులకు సర్జరీలు నిర్వహించారు. పేద కుటుంబాల ఆవేదనలకు ఈ ఆస్పత్రి ముగింపు పలుకుతున్నది. అత్యాధునిక పరికరాలు, ప్రపంచ స్థాయి వైద్య సౌకర్యాలతో దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నది. ప్రభుత్వాలు చేయలేని పనిని సత్యసాయి ట్రస్ట్ ఘనంగా చేసి చూపుతోంది. మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు మన తెలంగాణలోనూ ఇలాంటి ఆస్పత్రి ఉండటం మన రాష్ట్ర ప్రజల అదృష్టం. మూడు లక్షల నుంచి పది లక్షల వరకు ఖర్చయ్యే గుండె ఆపరేషన్లను పేద కుటుంబాలకు ఉచితంగా అందించడం గొప్ప సేవ. ఇక్కడి వైద్యులు, సిబ్బంది సేవాస్పూర్తితో పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా సత్య సాయి ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాస్‌ను, మధుసూదన సాయిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. వారిద్దరి నాయకత్వం వల్లే ఇలాంటి గొప్ప సేవా సంస్థలు సమాజానికి లభిస్తున్నాయి. వారికి కృతజ్ఞతలు అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ప్రతి సంవత్సరం రెండు లక్షల మంది పిల్లలు గుండె సమస్యలతో జన్మిస్తుంటే, వారిలో కేవలం 10వేల మందికకి మాత్రమే అవసరమైన చికిత్స లభిస్తోంది. ఈ పరిస్థితుల్లో సత్యసాయి ట్రస్ట్ సేవలు మరింత విస్తరించి, చిన్నపిల్లల ప్రాణాలు కాపాడాలని మనసారా కోరుకుంటున్నాను. ఇక్కడ పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది అందరికీ హృదయపూర్వక అభినందనలు. ఈ ఆస్పత్రి గుండె ఆపరేషన్లకే పరిమితం కాకుండా, ప్రపంచ స్థాయి వైద్య సౌకర్యాలతో ప్రజలకు సేవ చేస్తోంది. కేవలం ఆరు రోజుల్లో 18 మంది పిల్లలకు సర్జరీలు పూర్తిచేసి, వారికి పునర్జన్మ ప్రసాదించడం గొప్ప విషయం అని హరీశ్‌రావు కొనియాడారు.
ఇక్కడి వైద్యులు మనసుతో పని చేస్తూ మానవత్వానికి నిలువెత్తు ఉదాహరణగా నిలుస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కోట్ల రూపాయలు సంపాదించే అవకాశాలు ఉన్నప్పటికీ, తమ సేవలను పేద పిల్లల జీవితాలను కాపాడటానికి అంకితమిచ్చిన వైద్యులు నిజమైన దేవదూతలు. ఇది కేవలం వైద్యసేవ మాత్రమే మాత్రమే కాదు. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం కూడా. ఇలాంటి గొప్ప సేవలను అందించినందుకు సత్య సాయి ట్రస్ట్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సత్యసాయి ట్రస్ట్ సేవలు చిరస్థాయిగా నిలుస్తాయని పేర్కొంటూ, ఈ సేవలను విస్తరించి తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి కుటుంబానికి చేరాలి అని హరీశ్‌రావు ఆకాంక్షించారు.
ఇవి కూడా చదవండి..