Harish Rao | రైతు భరోసా విషయంలో కూడా రైతులను నేరస్తులుగా భావించడం దారుణమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డి విజయవంతంగా రైతుబంధును ఎగ్గొట్టి, రైతు భరోసాకు కోతలు పెట్టేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని విమర్శించారు. వ్యవసాయ మంత్రి, ఆర్థిక మంత్రి, సీఎం రైతు భరోసాకు కోతలు పెట్టేందుకు కుస్తీ పడుతున్నారన్నారు. ఇదే రేవంత్ రెడ్డి గతంలో రైతుబంధు ఏడాదికి మూడుసార్లు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారని గుర్తు చేశారు.
అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా రైతుబంధు ఇవ్వలేదన్నారు. ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట అధికారంలో ఉంటే ఒక మాట.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాలుకకు నరం లేదు.. ఏదైనా మాట్లాడుతాడని.. అధికారంలోకొస్తే ఏదైనా మరచిపోతారని ధ్వజమెత్తారు. రుణమాఫీకి షరతులు పెట్టి సగం మంది రైతులకు కూడా రుణమాఫీ చేయలేదని ఆరోపించారు. ప్రభుత్వం వద్ద అన్ని రికార్డులు ఉన్నాయని.. ప్రభుత్వం వద్ద ఉన్న రికార్డులతోనే కేసీఆర్ 11 సార్లు రైతుబంధు రైతులకు ఇచ్చారన్నారు. రైతు భరోసాకు రైతులు దరఖాస్తు చేసుకోవాల్సిందేనన్నారు. ‘నేను ఇస్తున్న సమాచారం అంతా సరైందేనని.. తప్పుడు సమాచారం ఇచ్చినా.. తప్పుడు లెక్కలు తేలినా మీరు తీసుకోబోయే చర్యలకు నేను శిక్షార్హుడిని’ అని రైతులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి అంటున్నాడని ఆరోపించారు.
దేశానికి అన్నం పెట్టే రైతు ఎండనక వాననక ఆరుగాలం కష్టపడి అందరికీ అన్నం పెట్టే రైతుకు షరతులు పెడతావా? అంటూ మండిపడ్డారు. బడా బాబులకు, పారిశ్రామికవేత్తలకు ఎలాంటి షరతులు లేకుండా వేలకోట్లు మాఫీ చేస్తారని.. రైతులంటే షరతులు వస్తున్నాయంటూ విమర్శించారు. రైతులకు బేడీలు వేసి అవమానించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. రైతు భరోసా విషయంలో కూడా రైతులను నేరస్తులుగా భావించడం దారుణమన్నారు. అన్నదాతలంటే అంత అలుసు ఎందుకు రేవంత్ రెడ్డి నీకు అంటూ నిలదీశారు. రుణమాఫీ కోసం రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పారని.. ఇప్పుడు రైతు భరోసా కోసం మళ్లీ పైరవీకారుల చుట్టూ కాంగ్రెస్ నాయకులు చుట్టూ తిరగాలని మీరు చూస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఉన్నప్పుడు రైతుల కడుపులో చల్ల కదలకుండా.. ఇంట్లో నుంచి కాలుబయట పెట్టకుండా రైతుబంధు డబ్బులు నేరుగా బ్యాంకులో పడ్డాయని గుర్తు చేశారు. కానీ, రేవంత్ రెడ్డి పైరవీకారుల చుట్టూ కాంగ్రెస్ నాయకులు చుట్టూ రైతులను తిరిగేలా చేస్తున్నాడని విమర్శించారు.
కేసీఆర్ గతంలో ఇచ్చిన విధంగా రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అధికారంలోకి వస్తే తాము రూ.15వేలు ఇస్తామన్నారని గుర్తు చేశారు. వానాకాలం, యాసంగి కలిపి ఎకరానికి రూ.15వేల చొప్పున ఇవ్వాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. సంగారెడ్డిలో ఎక్కువ పండే ఎక్కువ సాగవుతుందని.. పత్తిని సాగు చేసే రైతులకు పెట్టుబడి సహాయం ఒకేసారి ఇస్తామని ప్రభుత్వం లీకులు ఇస్తున్నదన్నారు. ఏడు, ఎనిమిది నెలలు సాగు చేసే పంటలలకు పసులు, అల్లం, పత్తి రైతులకు ఒకేసారి రైతుభరోసా ఇస్తామంటే రైతుల కడుపుకొట్టడమేనన్నారు. వానకాలంలో కోటి నలభై వేల ఎకరాలు సాగవుతాయని.. యాసంగి కొచ్చేటప్పటికి 50 లక్షలు ఎకరాల్లో పత్తి సాగు చేసే రైతులు చేయరన్నారు. ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో పత్తి సాగవుతుందని.. ఎక్కువ శాతం చిన్న సన్న కారు రైతులు, దళితులు గిరిజనులు, మాత్రమే ఎక్కువ పత్తిని సాగు చేస్తారన్నారు.