సిద్దిపేట, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వానకాలం సీజన్‌కు రైతు భరోసా ఇవ్వలేమని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చావుకబురు చల్లగా చెప్పారని హరీశ్ మండిపడ్డారు. సిద్దిపేట ప్రెస్మీట్లో శనివారం ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాట తప్పినందుకు సీఎం రేవంత్‌రెడ్డి తక్షణమే ముక్కునేలకు రాసి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రూ.లక్షా 50 వేల కోట్లు మూసీ సుందరీకరణకు ఉంటాయి గాని, రైతులకు రూ.15 వేల చొప్పున రైతుభరోసా ఇవ్వలేవా? అని ప్రశ్నించారు. ‘రుణమాఫీ, బోనస్ విషయంలో రైతులను మోసం చేసినవ్.. ఇప్పుడు రైతు భరోసా విషయంలో మోసం చేసినవ్’ అని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ మంత్రులను, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ నిలదీయాలని రైతులకు పిలుపునిచ్చారు.