Harish Rao | ప్రజాపాలన అంటే సహాయం అడిగిన వరద బాధితులపై బాధితులపై లాఠీఛార్జ్ చేయడమేనా..? అంటూ రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు మాజీ మంత్రి, సిద్దపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. మెదక్ జిల్లా చేగుంటలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం వరద సహాయక చర్యలు చేయకుండా తమపై బురద జల్లుతున్నారని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారపక్షంలో ఉన్న బీఆర్ఎస్పై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఫెయిల్ అయ్యారన్నారు. 74 సంవత్సరాల వయసున్న ఏపీ సీఎం బయట తిరుగుతుంటే.. 54 సంవత్సరాలున్న సీఎం ఇంట్లో ఉన్నడని ఎద్దేవా చేశారు.
వాతావరణశాఖ చెప్పిన ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని.. ఇది ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. 16 మంది చనిపోయారు అని ప్రభుత్యం చెబుతుందన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు సహాయక చర్యల్లో పాల్గొన్నారని.. 31 మంది చనిపోయినట్లుగా తమకు సమాచారం ఉందన్నారు. ఖమ్మంలో తొమ్మిది సీట్లు ఇస్తే.. తొమ్మిది మందిని కాపాడలేకపోయారన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని.. తప్పులు సరిదిద్దుకొని ఆపదలో ఉన్న వారిని కాపాడాలని సూచించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మృతుల కుటుంబాలకు రూ.25లక్షలు అడిగిన మీరు.. చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు రూ.25లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలో వరద బాధితులపై పోలీసుల లాఠీఛార్జిని ఆయన ఖండించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సహాయక చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.