హైదరాబాద్ : సీఎం రేవంత్‌రెడ్డికి అవసరాల కొద్ది మాటలు మార్చడం అలవాటేనని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. మంగళవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో, ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి మాటల్లో ఉన్న తేడాను హరీశ్‌రావు వెల్లడించారు. అప్పుడొక మాట, ఆప్పుడొక మాట మాట్లాడిన విషయాన్ని గుర్తుచేశారు.
ఉద్యమం సమయంలో రేవంత్‌రెడ్డి ‘ఎవడ్రా జై తెలంగాణ అంటుండు..’ అని తెలంగాణ ఉద్యమకారుల మీదనే తుపాకీ గురిపెట్టిండని హరీశ్‌రావు గుర్తుచేశారు. అసుంటి రేవంత్‌రెడ్డి ఇయ్యాల ‘నేను ఉద్యమకారుడిని’ అని చెప్పుకుంటున్నడని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసినప్పుడు సోనియాగాంధీని బలిదేవత అని తిట్టిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు దేవత అని అంటున్నడని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీకి తనంతటి విధేయుడే లేడని మాట్లాడుతన్నడని అన్నారు. కేసీఆర్ హయాంలో ఉద్యోగ నియామకాలు చేపడితే.. ఆ ఉద్యోగులకు నియామక పత్రాలు పంచిన రేవంత్‌రెడ్డి తాను ఉద్యోగాలు ఇచ్చినట్టు చెప్పుకుంటున్నడని, ఆయన అంతటి ఘనుడు అని వ్యాఖ్యానించారు.