హైదరాబాద్ : తెలంగాణ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం అంతా ఇంతా కాదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రాతో కలిపింది కాంగ్రెస్సే, మన విద్యార్థులను పొట్టనపెట్టుకుంది కాంగ్రెస్సే, మన ప్రాజెక్టులను రద్దుచేసింది కాంగ్రెస్సే అని ఆయన విమర్శించారు. చివరికి 11వ షెడ్యూల్లో కూడా పాలమూరు, దిండి ప్రాజెక్టులను పెట్టకుండా పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణభవన్‌లో పీపీటీ ఇస్తూ హరీశ్‌రావు ఈ కామెంట్స్ చేశారు.
హరీశ్‌రావు కామెంట్స్ ఆయన మాటల్లోనే.. ‘తెలంగాణ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం అంతా ఇంతా కాదు. మన ప్రాంతాన్ని ఆంధ్రాతో కలిపింది కాంగ్రెస్. మన విద్యార్థులను పొట్టన పెట్టుకుంది కాంగ్రెస్. మన ప్రాజెక్టులను రద్దుచేసింది కాంగ్రెస్. చివరికి 11వ షెడ్యూల్లో కూడా పాలమూరు, దిండి ప్రాజెక్టులను పెట్టకుండా పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు అన్యాయం చేసింది కాంగ్రెస్. ఇంక సోనియాగాంధీ రక్షణలు కల్పించిందని రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నడు. ఏం రక్షణలు కల్పించింది..? పాలమూరు, దిండి ప్రాజెక్టులను 11వ షెడ్యూల్లో పెట్టకపోవడం రక్షణనా, నీటి పంపకాలు సెక్షన్ 3 ప్రకారం చేయాలని చెప్పకపోవడం రక్షణనా..?’ అని ప్రశ్నించారు.
‘తెలంగాణ ప్రాంతానికి నాడైనా, నేడైనా నెంబర్‌వన్ విలనే కాంగ్రెస్ పార్టీ’ అని కేసీఆర్ చెప్పిన మాటలు అక్షర సత్యమని ఇయ్యాల తేలిపోయింది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలోనే కృష్ణా ప్రాజెక్టును కేఆర్ఎంబీకి అప్పజెప్తం అంటడు. కృష్ణానదీ జలాల్లో అతితక్కువ వినియోగం చేస్తరు. ఇప్పుడు గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై లోపాయికారిగా ఒప్పందం చేసుకుంటరు’ అని హరీశ్‌రావు విమర్శలు గుప్పించారు.