Harish Rao | సిద్దిపేట : యూరియా కోసం అన్నదాతలు నడిరోడ్డెక్కి ధర్నాలు చేసే దుస్థితిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతులకు యూరియా ఇవ్వలేని చేతగాని, దద్దమ్మ ప్రభుత్వాలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతలను అరిగోస పెడుతున్న కాంగ్రెస్, బీజేపీలకు రైతుల ఉసురు తగులుతుందని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.
సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామం వద్ద ఎరువుల కోసం క్యూలో బారులు తిరిన రైతులను చూసి మాజీ మంత్రి హరీష్ రావు ఆగారు. ఈ సందర్భంగా వారిని పలుకరించగా.. ఉదయం 5 గంటల నుండి ఇక్కడే ఉంటున్నాం.. ఒక ఆధార్ కార్డుకి ఒకటే బస్తా ఇస్తామంటున్నారు. ఆధార్ కార్డు, ఓటీపీ అంటూ కాలయాపన చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని హరీశ్‌రావుతో రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
కేసీఆర్ ఉన్నప్పుడు ఈ గోస లేదని.. కాంగ్రెస్ వచ్చాక నీళ్ళు లేవు, యూరియా లేదు అంటూ రైతులు ఆవేదన వెలిబుచ్చారు. యూరియా ఎప్పుడు వేసుకోవాలి.. ఎప్పుడు పంట పండాలి అంటూ ఆందోళన వ్యక్తం చేశారు రైతులు. కేసీఆర్ హయంలో హమాలీ ఖర్చులు ఇచ్చి ఇంటికి యూరియా పంపించామని హరీశ్‌రావు గుర్తు చేశారు. ఉదయం నుండి రైతులు వచ్చి ఇబ్బందులు పడుతుంటే పట్టించుకొనే అధికారి లేడు అని అగ్రికల్చర్ అధికారులపై హరీశ్‌రావు సీరియస్ అయ్యారు.
8 మంది బీజేపీ ఎంపీలు గెలిచి రాష్ట్రానికి ఎరువుల కొరత తీర్చడంలో విఫలం అయ్యారని హరీశ్‌రావు మండిపడ్డారు. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి ఎరువుల కొరతపై నోరు మెదపడం లేదు.. రైతుల ఉసరు ఉట్టిగా పోదు.. 4 రోజుల నుండి వ్యసాయ పనులు వృధా చేసుకొని యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బిజేపీలకు తగిన గుణపాఠం చెపుతారు అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి 51 సార్లు ఢిల్లీకి పోయాడు.. కానీ ఎరువుల కొరత తీర్చలేదు. మీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నాడు. రేవంత్ రెడ్డి తిట్లు ఎక్కువ పని తక్కువ అని. ప్రజలకు కావాల్సింది తిట్లు కాదు, పని కావాలి. రేవంత్ రెడ్డికి తిట్ల మీద ఉన్న ధ్యాస.. పని మీద లేదు. రైతులు సూటిగా అడుగుతున్నారు కేసీఆర్ ఉన్నపుడు ఎరువులు ఎట్లా వచ్చాయి.. ఇప్పుడు ఎట్లా రావు అని. వెంటనే ఓటీపీ, ఒక్క బస్తా విధానాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు.
పదేళ్ల కేసీఆర్ పాలనలో ఎరువుల ఇబ్బంది లేదు. ప్రతి మండలానికి గోదాంలు ఏర్పాటు చేసుకొని, వేసవి కాలంలోనే ఎరువులు స్టాక్ పెట్టినం. గ్రామం నుండి రైతు కాలు బయట పెట్టకుండా.. హమాలీ, ట్రాన్స్పోర్ట్ ఖర్చు లేకుండా రైతు సమయం వృధా కాకుండ గ్రామంలోనే ఎరువులు అందిచాం. నాలుగు రోజుల నుండి ఇక్కడికి వచ్చి ఉంటే ఒక్క బస్తా ఇస్తామని చెప్పడం బాధాకరం. దేవుడు దర్శనం దొరుకుతుంది కానీ ఎరువుల బస్తా దొరకడం లేదని మహిళా రైతు భాగ్యమ్మ చెప్పడం ఈ ప్రభుత్వం రైతుల పట్ల చిన్న చూపునకు నిదర్శనం. వెంటనే ఓటీపీ విధానం, ఒక బస్తా విధానంను తీసేయాలని డిమాండ్ చేశారు. రైతుల అవసరాలకు అనుగుణంగా ఎరువుల బస్తాలు ఇవ్వాలని డిమాండ్ హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
మళ్ళీ పాత రోజులు వచ్చాయి.. ఇదేనా కాంగ్రెస్ మార్పు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వం, నానో యూరియా వాడాలని చెప్పడం రైతులపై 500 రూ. అదనపు భారం వేయడమే. నానో యూరియ తో రైతులకు ఎకరానికి రూ. 500లు భారం పడుతుంది. ప్రభుత్వం సబ్సిడీ నుండి తప్పించుకోడానికి కృత్రిమ ఎరువులను సృష్టిస్తుంది. ఎన్నికలు ఉన్నాయని బీహార్‌కు ఎరువులను తరలిస్తున్నారని హరీశ్‌రావు పేర్కొన్నారు.