Harish Rao | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి ఎంత దిగజారాడంటే, బసవేశ్వరుడి జయంతిని కూడా చిల్లర రాజకీయాల కోసం వాడుకున్నాడు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. సమ సమాజ స్థాపన కోసం, జాతి, కుల, మత, లింగ వివక్షలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మహనీయుడు బసవేశ్వరుడు. ఆ మహనీయుడి స్పూర్తిని ప్రజలకు చాటాలని, వారి జయంతిని అధికారికంగా నిర్వహించాలని నాడు కేసీఆర్ నిర్ణయించారు. నేడు రవీంద్ర భారతిలో ప్రభుత్వం నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి అడ్డగోలుగా రాజకీయాలు మాట్లాడిండు అని హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.
పదో తరగతి ఫలితాల విడుదలను కూడా తన రాజకీయ అవసరానికి వాడుకున్నడు. పది గంటలకు విడుదల చేయాల్సిన ఫలితాలను, రెండు సార్లు సమయం మార్చి చివరకు రెండున్నరకు విడుదల చేసిండు. ఫలితాల కోసం ఎదురు చూసే పిల్లల జీవితాలతో వారం రోజులుగా తేదీలు మార్చి, టైమింగ్స్ మార్చి ఆడుకున్నరు. విద్యార్థులను ముందు పెట్టుకొని నీచంగ మాట్లాడి ముఖ్యమంత్రి స్థాయిని, హోదాను దిగజార్చిండు. అచ్చోసిన ఆంబోతు అంటడు, సమాధి అంటడు కనీసం సోయి లేకుండా మాట్లాడిండు. ఇదేనా విద్యార్థులకు నువ్వు చెప్పేది రేవంత్ రెడ్డి, నువ్వా విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇచ్చేది. రవీంద్రభారతిలో రాజకీయాలు మాట్లాడి దాని గౌరవాన్ని తగ్గించావు అని సీఎంపై హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
విద్యార్థుల మెదళ్లలో విషం నింపుతున్న ముఖ్యమంత్రి ఎక్కడా ఉండడు.. రజతోత్సవ సభను చూసినప్పటి నుంచి రేవంత్‌కు నిద్ర పట్టడం లేదు కళ్లలో, కడుపులో మాత్రమే కాదు నిలువెల్లా విషం నింపుకున్నడు. కడుపులో పెట్టుకున్న విషాన్ని, ఆపుకోలేక ఈరోజు బయట కక్కిండు. కేసీఆర్ గురించి అవే చిల్లర మాటలు మాట్లాడి, కుక్క తోక వంకరే అని మరోసారి రుజువు చేసిండు రేవంత్ రెడ్డి. కేసీఆర్ అన్నట్లు కాంగ్రెస్ ముమ్మాటికీ తెలంగాణకు విలనే. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు, ఉద్యమం చేసి, రాష్ట్రం ఇచ్చే అనివార్య పరిస్థితిని నాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కల్పించిండు కేసీఆర్. కేంద్రం మెడలు వంచి సాధించిండు కేసీఆర్. అది ఇచ్చినోళ్ల గొప్పతనమా, సాధించినోళ్ల గొప్పతనమా? అని హరీశ్‌రావు సీఎంను ప్రశ్నించారు.