Harish Rao | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఎస్ఎల్బీసీ సొరంగం వద్దకు వెళ్లే ముందు హైదరాబాద్ హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
ఎస్ఎల్బీసీ ఘటనలో సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. దాదాపు ఐదు రోజులు పూర్తవుతున్నప్పటికీ సహాయక చర్యలు కనీసం ప్రారంభం కాలేదు. వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయాన్ని సాధించడంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయింది. కేంద్ర ప్రభుత్వ బృందాలు, రాష్ట్ర ప్రభుత్వ బృందాలు, ఏజెన్సీ మధ్య సమన్వయం లోపించింది. వీరికి డైరెక్షన్ ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది అని హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
మంత్రులు అక్కడికి వెళ్లి హెలికాప్టర్లలో టీవీ ఇంటర్వ్యూలు ఇవ్వడానికి పోటీ పడుతున్నారు తప్ప, సహాయక చర్యలు చేపట్టడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. పైనుంచి హెలికాప్టర్లో చూస్తే సొరంగం లోపల ఏమన్నా కనిపిస్తాదా, ప్రత్యేకంగా చూడడానికి వీఎక్స్ రే కెమెరాలు ఉన్నాయా? హెలికాప్టర్లలో చెక్కర్లు కొట్టుడు టీవీ ఇంటర్వ్యూలు ఏమిటో నాకు అర్థం కావడం లేదు. వారి ప్రాణాలు కాపాడటానికి ప్రతి నిమిషం కూడా చాలా ముఖ్యమైనటువంటిది. క్షణం కూడా చాలా విలువైనటువంటిది. ఎంత తొందరగా సహాయక చర్యలు ప్రారంభించడం ద్వారా వాళ్ల ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయాలి. లోపల ఆహారం లేక తాగునీరు లేక చావు బ్రతుకుల మధ్య కొట్టాడుతున్నారు. వారి ప్రాణాల మీద రాష్ట్ర ప్రభుత్వానికి శ్రద్ధ కరువైందేమోనని అనిపిస్తుందని హరీశ్‌రావు పేర్కొన్నారు.
సహాయక చర్యలు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడం దారుణం. ప్రమాదం జరగటం దురదృష్టకరం, ఇలాంటి పరిస్థితుల మధ్య ఘటన జరిగింది ఆ విషయాలన్నీ బయటికి రావాలి. జరిగిన సంఘటన తర్వాత ప్రభుత్వ స్పందన బాధాకరంగా ఉంది. రేవంత్ రెడ్డి హెలికాప్టర్ వేసుకొని ఎన్నికల ప్రచారానికి వెళ్లిండు. ఎనిమిది మంది ప్రాణాలు ముఖ్యమా? ఎన్నికల ప్రచారం ముఖ్యమా రేవంత్ రెడ్డికి? కనీసం అక్కడికి వెళ్లి, ఒక డైరెక్షన్ ఇవ్వడంలో రేవంత్ రెడ్డి, నీటి పారుదల మంత్రి పూర్తిగా ఫెయిలయ్యారు. సహాయ చర్యలకు విఘాతం కల్పించవద్దు, ప్రభుత్వానికి సహకరించాలి, సమయమనం పాటించాలని గత నాలుగైదు రోజులుగా బిఆర్ఎస్ పార్టీ ఉంది. బాధ కలిగించే అంశం ఏమిటంటే ఇప్పటివరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఒక్కొక్కరు ఒక్కో మాట చెబుతున్నారు అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
అనేక టీమ్‌లు వచ్చాయని అంటున్నారు, కానీ డైరెక్షన్ ఈ ప్రభుత్వం ఇవ్వాలి. కానీ అందులో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. మేము సంయమనం పాటిస్తుంటే కాంగ్రెస్ పార్టీ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ఉత్తం టన్నెల్ దగ్గర కూర్చొని బిఆర్ఎస్ మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి బిఆర్ఎస్ మీద బురద చల్లుతున్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీళ్లు, వాటరు అంటూ ఏవో ఏవో మాట్లాడుతున్నాడు. ఆయన గురించి మాట్లాడుడు దండగ. ముఖ్యమంత్రి మాటలకు ఉత్తమ్ మాటలకు పొంతన లేదు. బిఆర్ఎస్ ను విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదు. తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి, ఇతరుల మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు అని హరీశ్‌రావు మండిపడ్డారు.