Harish Rao | హైదరాబాద్ : దక్షిణ భారత దేశం అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి చిన్నచూపు అని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. గోధుమలకు మద్దతు ధర పెంచి, వడ్లకు పెంచలేదు. గోధుమలకో నీతి, వడ్లకో నీతి ఉంటుందా? అని నిప్పులు చెరిగారు. సిద్దిపేట బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
బిజెపి ప్రభుత్వం ఎప్పుడు దక్షిణ భారతదేశాన్ని చిన్నచూపు చూస్తున్నది. గోధుమల మద్దతు ధర పెంచారు సంతోషం. దక్షిణ భారతదేశంలో పండే వడ్లకు ఎందుకు మద్దతు ధర పెంచరు. క్వింటాల్ గోధుమలకు 160 మద్దతు ధర పెంచి రూ. 2585కు బిజెపి ప్రభుత్వం నిర్ణయించింది. వరి విషయంలో మాత్రం 69 రూపాయలు పెంచి రూ. 2369కు మాత్రమే నిర్ణయించారు. గోధుమలకు ఒక నీతి.. వరికో నీతి ఎందుకు? అని నిలదీశారు.
ఉత్తర భారత దేశ రైతులకు ఒక నీతి దక్షిణ భారతదేశ రైతులకు ఒక నీతి. ఎందుకు దక్షిణ భారతదేశ రైతులంటే బిజెపికి చిన్న చూపు. గోధుమలతో సమానంగా వరికి మద్దతు ధర ఇవ్వాలని బిజెపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ నుండి ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి వరికి మద్దతు ధర పెంచాలి. ఆరుగాలం కష్టపడే రైతు పట్ల ఎందుకు అంత వివక్ష. తెలంగాణలో మెజార్టీగా వరి పండుతుంది. దేశంలో అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ.
అతి ఎక్కువ నష్టం తెలంగాణకే జరుగుతున్నది. క్వింటాల్‌కు రూ. 220 నష్టం జరుగుతుంది. ఎకరానికి 30 క్వింటాల్స్ పండితే ఎకరానికి రూ. 7000లు తెలంగాణ రైతులు నష్టపోతున్నారు. గోధుమలకు ఇచ్చినట్టు వరికి కూడా మద్దతు ధర సమానంగా ఇస్తే తెలంగాణలో రైతులకు ఎకరానికి రూ. 7000లు లాభం జరుగుతుంది. తెలంగాణ బిజెపి ఎంపీలారా.. రైతుల పక్షాన నిలబడతారా? కేంద్రానికి కొమ్ము కాస్తారా? అని హరీశ్‌రావు నిలదీశారు.