Harish Rao | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై సీఎంకు ఏ మాత్రం శ్రద్ధ లేదని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఎందుకు మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి. గోదావరి కృష్ణా జలాలు మీ అయ్య సొమ్మా..? నువ్వు తెలంగాణకు కాపలాదారు మాత్రమే. రాష్ట్ర హక్కులను చంద్రబాబుకు రాసిస్తా.. ఆంధ్ర ప్రదేశ్‌కు రాసిస్తా అంటే రాష్ట్ర ప్రజలు ఊరుకోరు. ఎవరు చంద్రబాబు అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు. తప్పుడు సమాచారం ఇస్తే జైల్లో వేస్తామని హెచ్చరికలు పొందిన వ్యక్తి ఈరోజు రేవంత్ రెడ్డికి సలహాదారుడు. తెలంగాణ ప్రయోజనాలు దెబ్బకొడుతూ ఏపీకి వత్తాసు పలుకుతూ.. ఏపీ అక్రమ ప్రాజెక్టులను కాపాడే ప్రయత్నం చేస్తే జైల్లో వేస్తామని కోర్టు బెదిరించింది. భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అంబికా దర్బార్ బత్తి అంటున్నాడు రేవంత్. ఈరోజు చంద్రబాబు అనే భగవంతుడికి రేవంత్ అనే భక్తుడికి మధ్య ఉన్న అంబికా దర్బార్ బత్తి ఈ ఆదిత్యనాథ్ అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
3000 టీఎంసీ అనే బ్రహ్మ పదార్థం కేసీఆర్ కనిపెట్టిండు అంటడు. గోదావరి నుండి ఎన్ని నీళ్లు సముద్రంలో కలుస్తాయని 60 ఏళ్ల లెక్కలు సీడబ్ల్యూసీ చెప్పింది. దాని ప్రకారం ప్రతి ఏటా కనీసం 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. ఇదే విషయాన్ని కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో చెప్పారు. దీనికి కూడా రేవంత్ రెడ్డి వక్రీకరించారు. బనకచర్ల ముచ్చట ఇక్కడ లేదు. తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు పది అబద్దాలు మాట్లాడడం రేవంత్ రెడ్డి అలవాటు.నిన్న రేవంత్ రెడ్డి అపెక్స్ కౌన్సిల్లో చదివిన దాన్ని నేను కూడా చదువుతాను. బనకచర్లకు నీళ్లు తీసుకువెళ్లాలని అందులో ఎక్కడా లేదు అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
కృష్ణా నదిలో రెండు రాష్ట్రాలకు నీటి వినియోగం 1000 టీఎంసీలకు మించడం లేదు. ప్రతి సంవత్సరం 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్తుంది. ఈ నీటిని రెండు రాష్ట్రాలు ఎలా ఉపయోగించుకోవాలి అనే అంశంపై ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలని రెండు రాష్ట్రాలకు లాభం చేకూరే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని కేసిఆర్ సూచించారు. అదే పేజీలో చెప్పిన ఇంకో అంశాన్ని మాత్రం కావాలని చదవలేదు. చాలా స్పష్టంగా గోదావరి, కృష్ణా నదుల అనుసంధాన విషయంలో తెలంగాణను సంప్రదించకుండా ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోకూడదని ఒకవేళ వెళ్తే తెలంగాణ అందుకు అంగీకరించదు అని చెప్పారు. దీని మాత్రం దాచి పెట్టిండు. 1000 టీఎంసీలు ఇచ్చి ఎన్నైనా పట్టుకోపో అంటున్నాడు. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్ల గురించి. ఎంతోమంది ఆత్మబలి దానాలు చేసుకున్నారు. నువ్వు ఉద్యమం చేయలేదు కాబట్టి నీకు తెలియదు. అడ్డదారిలో పార్టీలు మారుకుంటూ అధికారంలోకి వచ్చావు తప్ప ఉద్యమం చేయలేదు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో కేసీఆర్ ఎన్నడూ అగ్రి చేయలేదు అసలు బనకచర్ల అనే చర్చ లేదు అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
జగన్‌తో ఏమి మాట్లాడామో ఎజెండా ఉంటే బయట పెట్టు. రెండు రాష్ట్రాలకు నదీజలాల గురించి కేసీఆర్ మాట్లాడారు. వాస్తవానికి ఆ ప్రస్తావన ముందుకు పోలేదు. జగన్ అంగీకరించలేదు. నది మార్గంగా నీళ్లు తేవాలని అప్పుడు అనుకున్నారు. దానివల్ల నాగార్జునసాగర్, శ్రీశైలం పరిధిలో నీళ్లు వస్తాయి అని. కానీ ఈరోజు వీళ్లు చేస్తున్నది నది మార్గంగా కాకుండా, తెలంగాణ టచ్ కాకుండా 200 టీఎంసీలు తన్నుకుపోతున్నారు. దీని ఆపాల్సిన బాధ్యత మన మీద లేదా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు.