Harish Rao | హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు. పీజీ వైద్య విద్యా ప్రవేశాల్లో రిజర్వేషన్లు లేకపోవడంతో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం, తక్షణ చర్యలపై లేఖ రాశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ ఏడాది పీజీ వైద్య విద్యా ప్రవేశాల్లో తెలంగాణ విద్యార్థులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. మేనేజ్మెంట్ కోటా సీట్లలో స్థానిక రిజర్వేషన్ కల్పించకపోవడంతో వందలాది తెలంగాణ విద్యార్థులు పీజీ సీట్లు కోల్పోతున్నారు.
ఏపీలో 85 శాతం లోకల్ రిజర్వేషన్.. తెలంగాణలో మాత్రం శూన్యం. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మన రాష్ట్ర విద్యార్థులు అవకాశాలను ఇతర రాష్ట్రాల విద్యార్థులు కొల్లగొడుతున్నారు. 450 పీజీ సీట్లు ఆలిండియా కోటాకు వెళ్లిపోతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యంతో 382 సీట్లు తెలంగాణ విద్యార్థులు కోల్పోతున్నారు అని హరీశ్‌రావు తెలిపారు.
కేసీఆర్ పాలనలో జిల్లాల వారీగా మెడికల్ కాలేజీలు ప్రారంభించారు. స్థానిక విద్యార్థుల ప్రయోజనాల కోసం అడ్మిషన్ రూల్స్‌లో సవరణలు చేశారు. 2014 జూన్ 2 తర్వాత ఏర్పాటైన కాలేజీల్లో 100 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్‌కు ప్రాధాన్యం ఇచ్చింది. కాంగ్రెస్ తెలంగాణ విద్యార్థుల భవిష్యత్‌ను ప్రమాదంలోకి నెడుతుంది. ప్రభుత్వం మొద్దునిద్ర వీడి వెంటనే చర్యలు చేపట్టాలి. మేనేజ్మెంట్ కోటా సీట్లలో 85 శాతం స్థానిక రిజర్వేషన్ అమలు చేయాలి. ప్రస్తుతం విడుదల చేసి పీజీ ప్రవేశాల నోటిఫికేషన్‌ను రద్దు చేయాలి. విద్యార్థుల ప్రయోజనాలు రక్షించేలా స్పష్టమైన విధానం రూపొందించాలి అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.