Harish Rao | హైదరాబాద్ : ఒక్క జింకను చంపిన సల్మాన్‌ఖాన్‌ను జైల్లో వేశారు.. మరి మూడు జింకలను చంపిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలేవి అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. తాజ్‌కృష్ణ హోటల్లో సెంట్రల్ ఎన్విరాన్మెంట్ అడ్వైజర్ కమిటీకి కంచ గచ్చిబౌలి భూములపై ఫిర్యాదును ఇచ్చిన అనంతరం తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
కంచ గచ్చిబౌలిలో మూడు జింకలు చనిపోయాయని ఆధారాలతో సహా బయటకు వచ్చాయి. గూడును చెదరగొట్టడంతో దిక్కులేక కుక్కల దాడిలో జింకలు చనిపోయాయి. సల్మాన్‌ను ఒక జింకను చంపితే జైల్లో వేశారు. ఏండ్ల తరబడి కోర్టులు, పోలీసు స్టేషన్ల చుట్టూ తిరిగారు. మరి మూడు జింకల మరణానికి కారణమైన రేవంత్ రెడ్డిపై న్యాయపరమైన చర్య తీసుకోవాలి కదా..? వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం సెక్షన్ 29 కింద ఒక జంతువును చంపితే ఏడు సంవత్సరాల శిక్ష వేయాలని చట్టం చెబుతుంది. ప్రకృతిని విధ్వంసం చేసి మూగజీవాల విధ్వంసానికి పాల్పడి మూడు జింకలు చనిపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
అటవీశాఖను అడుగుతున్నా.. గ్రామాల్లో ఒక చెట్టను కొడితే కేసులు నమోదు చేసి బండ్లను సీజ్ చేస్తారు. హైదరాబాద్ నడిబొడ్డున 400 ఎకరాల్లో జీవ విధ్వంసం జరుగుతుంటే పీసీసీఎఫ్, డీఎఫ్‌వో, అటవీ శాఖ అధికారులు నిద్ర పోతున్నారా.?? పేదవాడు చట్టం మీద అవగాహన లేక ఒక చెట్టు కొడితే కేసులు పెట్టే మీరు వేలాది చెట్లను ఊచకోత చేస్తుంటే.. మీరు నిద్ర పోతున్నారా..? కంచ గచ్చిబౌలిలో జీవవిధ్వంసం జరుగుతుందని స్వయంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అటవీశాఖ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు ఇచ్చారు. స్పందన లేదు. ధర్నాలు కనిపించడలేదా..? ఇది అటవీశాఖ నేరపూరిత నిర్లక్ష్యం. అటవీ శాఖ స్పందించకపోవడం వల్లే చెట్లను నరికారు.. జింకలు మృత్యువాత పడుతున్నాయి. కంచ గచ్చిబౌలిలో అనేక ఉల్లంఘనలు జరిగాయని హరీశ్‌రావు తెలిపారు.