Harish Rao | హైదరాబాద్ : కేసీఆర్ వాటర్ మ్యాన్ అయితే.. రేవంత్ రెడ్డి వాటా మ్యాన్ అని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. అదృష్టం బాగుండి సీఎం అయ్యావు, ఐదేళ్లు ఉండు.. మంచిగ చేయి. ఇప్పటికే నువ్వు తెలంగాణ ద్రోహిగా చరిత్రలో ఎక్కావు. తెలంగాణ ద్రోహి లిస్టులో మొదటి పేరు నీదే, కానీ రాష్ట్ర ద్రోహిగా మిగలకు. నీళ్లలో తెలంగాణకు అన్యాయం చేయకు, నిజాయితీగా పని చేయి. కుక్క తోక వంకర అన్నట్లు అబద్దాలు మాట్లాడటం బంద్ చేయ్ అని సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు సూచించారు.
నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తాను కూడా రేవంత్ రెడ్డి లాగా అబద్దాలు మాట్లాడి ముఖ్యమంత్రి అవుదామని చూస్తున్నట్లు ఉన్నడు. ఎంతో కష్టపడి సీతారామకు అనుమతులు తెచ్చినం అని గొప్పలు చెప్పుకుంటున్నడు. 2023లోనే బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్, సీతమ్మ సాగర్‌కు 25 అనుమతులు వచ్చాయి. ఇందులో హైడ్రాలజీ, పర్యావరణం సహా అన్ని అనుమతులు ఉన్నాయి. అసెంబ్లీలో మాట్లాడుదామా హరీశ్ రావు అన్నడు. రేపు ఉదయం అసెంబ్లీ పెడితే నేను చర్చించేందుకు సిద్దం. కానీ ఒక్క కండీషన్ మైక్ కట్ చేయొద్దు. 15 రోజులు కృష్ణా, 15 రోజులు గోదావరి మీద మొత్తం నెల రోజులు మాట్లాడుదాం. రేపే పెట్టు అసెంబ్లీ, ఎంత సేపైనా మాట్లాడు. అడ్జర్న్ చేయొద్దు, పారిపోవద్దు. మీరు ప్రజెంటేషన్ చేయి, మాకు ప్రెజెంటేషన్ చేసే అవకాశం ఇవ్వు. మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అంటున్నడు, బనకచర్ల మీద ఉత్తరాలు రాయడం కాదు, చంద్రబాబు కోవర్టులు ఉన్నరు తెలంగాణలో అంటున్నడు. ఆ కోవర్టు ఎవరో అనిరుద్ చెబితే బాగుటుంది అని హరీశ్‌రావు పేర్కొన్నారు.