Harish Rao | హైదరాబాద్ : గోదావరిపై బనకచర్ల ప్రాజెక్టును కట్టి తీరుతామని ఏపీ మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. అసలు నారా లోకేశ్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ ఎందుకు నోరు మెదపడం లేదని హరీశ్‌రావు సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
బనకచర్లపై నారా లోకేశ్ రేవంత్ రెడ్డి బలం చూసుకొని మాట్లాడుతున్నాడు. బీజేపీ మా చేతుల్లో ఉంది.. మేం ఏం చెప్తే ఆది చేస్తారని ధైర్యంతో.. ఆడిండే ఆట.. పాడిందే పాట అనే ఒక ధైర్యంతో మాట్లాడుతున్నారు. లోకేశ్ బనకచర్ల ప్రాజెక్టు కట్టి తీరుతాం అనుమతులు తెచ్చి తీరుతాం అని మాట్లాడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరూ మాట్లాడరు ఖండించరు. దీన్ని బట్టి కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని అర్థమవుతుంది. మీ చీఫ్ సెక్రటరీ గోదావరి బనకచర్ల ఎజెండాలో ఉంటే మీటింగ్ రాం అని లేఖ రాస్తారు. మీరేమో రాత్రికి రాత్రి ఢిల్లీకి పోయి మొదటి అంశం గోదావరి బనకచర్ల ఉంటే కూడా ఆ మీటింగ్‌లో పాల్గొంటారు. కమిటీ వేయడానికి ఒప్పుకుని వస్తారు. మీ దైర్యం చూసుకొని లోకేశ్ మాట్లాడారు. ఎవడు అడ్డొచ్చిన కట్టి తీరుతాం అని లోకేశ్ అంటున్నారు. మరి నారా లోకేశ్ వ్యాఖ్యలపై ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నోరు మూసుకుంది. చంద్రబాబు బుల్డోజింగ్ విధానాలకు కాంగ్రెస్ బీజేపీ వంత పాడుతున్నాయి. మీరు సహకరించడం వల్లే లోకేశ్ ధైర్యంగా మాట్లాడుతున్నారు అని హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.
రేవంత్ రెడ్డేమో బనకచర్ల కడుతమంటే కదా నేను అడ్డు చెప్పేది అని అంటున్నాడు. కట్టి తీరుతా అనుమతులు తెస్తా అని లోకేశ్ మాట్లాడుతుంటే.. అడ్డు పడటం లేదు. ఈ మాటలను చూస్తుంటే రేవంత్ ఆల్రెడీ గురుదక్షిణ చెల్లించుకునే పనిలో ఉన్నాడు. లోకేశ్ ఏ ధైర్యంతో బనకచర్లపై బరితెగించి మాట్లాడుతున్నాడు. అంటే సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ బీజేపీలు డూడూ బసవన్నల మాదిరి తలూపడం వల్లే లోకేశ్ అంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. సీఎం రేవంత్ తన పదవిని కాపాడుకోవడం కోసం.. బీజేపీ తమ పీఠాన్ని ఢిల్లీలో కాపాడుకునేందుకు టీడీపీకి సహకరిస్తున్నారని హరీశ్‌రావు పేర్కొన్నారు.