Harish Rao | హైదరాబాద్ : తెలంగాణలో అన్ని సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి రవీంద్ర భారతి వేదికగా చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. ప్రజలు కష్టాల్లో ఉంటే ఎందుకు రావడం లేదని నువ్వే అంటున్నావు, మరోవైపు ప్రజలకు కష్టాలు లేవు, మాది ప్రజా పాలన అంటున్నావు రేవంత్‌కు జపాన్ వెళ్లి వచ్చి మైండ్ పాడైనట్లుంది లేకుంటే రజతోత్సవ సభకు వచ్చిన జనాన్ని చూసి మైండ్ బ్లాంక్ అయినట్లుంది.
సిగ్గులేకుండా ఏ పథకం ఆగిపోయిందో చెప్పాలి అంటున్నడు కేసీఆర్ కిట్టు ఆగిపోలేదా, దళిత బంధు ఆగిపోలేదా, బీసీ బంధు ఆగిపోలేదా, గొర్రెల పంపిణీ ఆగిపోలేదా, రెండు నెలల పింఛన్లు ఆగలేదా, డబుల్ బెడ్ రూం ఇళ్లులు ఆగలేదా, స్కాలర్ షిప్స్ ఆగలేదా, ఫీజు రీయింబర్స్ మెంట్ ఆగలేదా. మీ 15 నెలల పాలనలో ఆగని పథకం ఏదైనా ఉందా? విద్యార్థులను ముందు పెట్టుకొని, ఇచ్చిన మాట మీద నిలబడుతా అని గొప్పలు చెప్పి సప్పట్లు కొట్టించుకుంటున్నవు అని రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు ఫైర్ అయ్యారు.
నీ ఆరు గ్యారెంటీలు ఏమైనయి, నీ 420 హామీలు ఏమైనయి, ఏడాదిలో రెండున్నర లక్షల ఉద్యోగాలు ఏమైనయి జాబ్ క్యాలెండర్ ఏమైంది, విద్యార్థులకు విద్యాభరోసా కార్డు ఏమైంది, విద్యార్థినులకు స్కూటీ ఏమైంది, మహిళలకు 2500 ఏమైంది, తులం బంగారం ఏమైంది, కౌలు రైతులకు భరోసా ఏమైంది, 15వేల రైతు భరోసా ఏమైంది, ఇంకా సిగ్గు లేకుండా మాట తప్పను, శత్రువులు కూడా నన్ను ఏమనరు అంటడు. ఒక్కసారి నీ మేనిఫెస్టో చూసుకో రేవంత్ రెడ్డి. నీ మాట తప్పుడు ఏందో నీకే అర్థమైతది నీ సవాల్‌ను నేను స్వీకరిస్తున్నా రేవంత్ రెడ్డి, నువ్వు అన్నట్లు కాళేశ్వరం మీద చర్చ పెడుదామా? రుణమాఫీ మీద పెడుదామా? రైతు బంధు మీద పెడుదామా? నీ బోగస్ 60 వేల ఉద్యోగాల మీద పెడుదామా, కులగణన మీద పెడుదామా? దేని మీదైనా చర్చకు సిద్దం, ప్లేస్, టైం నువ్వే చెప్పు అని రేవంత్ రెడ్డిని హరీశ్‌రావు సవాల్ విసిరారు.
రుణమాఫీ మీద చర్చ అని ఇప్పటికే తోకముడిచినవు ఇప్పుడు కూడా అలా చేసి తప్పించుకోకు పదేళ్లు అధికారంలో ఉంటా అని పగటి కలలు కంటున్న రేవంత్ రెడ్డి, ఉన్న మూడేళ్లు నీ కుర్చీ సక్కగ ఉండేలా చూసుకో. ఏ పక్క నుంచి ఎవరు వచ్చి లాక్కుంటరో చూసుకో నువ్వు ఎంత మేకపోతు గాంభీర్యం చూపినా, కాంగ్రెస్ సర్కారు అట్టర్ ఫ్లాప్ అన్నది రోజుకోసారి నిరూపితమవుతున్నది. ఇదెక్కడి దిక్కుమాలిన ప్రభుత్వం అని అనుకోని ప్రజానీకం ఉందా అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే ఇంత ఘోరంగా విఫలమైన ప్రభుత్వం మరొకటి లేదు అతి తక్కువ కాలంలో అన్ని వర్గాల ప్రజలతో తిట్లు తింటున్న ఏకైక సీఎం రేవంతే అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
శిశుపాలుడి లెక్క తప్పు మీద తప్పు చేస్తున్న నీ వైఖరిని ప్రజలు అందరూ గమనిస్తున్నారు. తగిన సమయంలో బుద్ధి చెబుతారు. నీ పేరును కేసీఆర్ పలకాలని ఎన్నో రోజుల నుంచి అడుక్కుంటున్నవు. కుసంస్కారం, కుంచిత స్వభావం ఉన్న నీలాంటి వారి పేరును కేసీఆర్ తీయవలిసిన అవసరం ఏమిటి? అని సీఎంను హరీశ్‌రావు ప్రశ్నించారు.