Harish Rao | హైదరాబాద్ : “ఒక్క రైతు కూడా భూ సమస్య వల్ల ఆత్మహత్య చేసుకోకూడదు. రైతుల భూమి హక్కులు 100 శాతం కాపాడతాం” అని ఎన్నికల ప్రచారంలో అదరగొట్టిన రేవంత్ రెడ్డికి మీ పార్టీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల వద్ద, తహసిల్దార్ కార్యాలయాల వద్ద జరుగుతున్న రైతు ఆత్మహత్యాయత్నాలు కనిపించడం లేదా? అని మాజీ మంత్రి హరీశ్‌రావు సూటిగా ప్రశ్నించారు.
అధికారం లోకి వస్తే 3 నెలల్లో భూమి సమస్యలు పరిష్కరిస్తాం అన్న హామీ ఏమైంది రేవంత్ రెడ్డి? అని నిలదీశారు. భూముల రికార్డులు సరిచేస్తాం, రైతుల హక్కులు కాపాడతాం అని చెప్పి మీరు రెండేళ్లుగా కుంటి సాకులు చెబుతూ రిజిస్ట్రేషన్లు చేయకుండా రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారు. రైతు భూమి మీద ఆ రైతుకే హక్కు లేకుండా చేస్తున్న దుర్మార్గ ప్రభుత్వం మీది. ఇది రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ద్రోహం. ఆపదకో, అవసరానికో ఉన్న భూములు అమ్ముకోలేక.. అధిక వడ్డీకి రుణాలు తీసుకోలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ప్రజా పాలన దరఖాస్తులు ఏమయ్యాయి? రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులు ఏమయ్యాయి? ధరణి పేరు మార్చి తెచ్చిన భూ భారతి ఏమైంది? రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 70 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటే మీ ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? నెలల తరబడి రెవెన్యూ ఆఫీసులు, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా రైతులు, ప్రజల సమస్యలు మాత్రం పరిష్కారమవడం లేదు. ఇప్పటికే మీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల వల్ల 700 పైగా అన్నదాతలు ప్రాణాలు కోల్పోయారు. రుణమాఫీ కాక, రైతు భరోసా అందక, పంట బోనస్ ఇవ్వక పోవడంతో రైతులు ఆత్మస్థైర్యం కోల్పోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, రెవెన్యూ శాఖ మేలుకుని, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, రైతు ఆత్మహత్యలు చేసుకోకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నాం అని హరీశ్‌రావు పేర్కొన్నారు.