Harish Rao | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ప్రతిపాదిత ప్రాజెక్టుల నిర్మాణ పనులు ముందుకు పోక, ఉన్న ప్రాజెక్టుల నిర్వహణ లేక, కొత్త ప్రాజెక్టుల ఆలోచన రాక తెలంగాణ సాగు నీటి రంగం సంక్షోభంలోకి వెళ్తున్నది అని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ నీటి రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి, సాగును బాగు చేసిన ఘనత కేసీఆర్‌ది అయితే, ప్రాజెక్టులను పడావు పెట్టి, నిర్వహణ గాలికి వదిలి ఏపీకి నీళ్లు వదులుతున్న ఘనత రేవంత్ రెడ్డిది అని ధ్వజమెత్తారు.
ఏడాదిన్నర పాలనలో జరిగిన ప్రాజెక్టుల ప్రమాదాలు, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనాలు..
ఖమ్మం: పెద్దవాగు కొట్టుకుపోయింది
నల్లగొండ: సుంకిశాల కుప్ప కూలింది.
పాలమూరు: వట్టెం పంప్ హౌజ్ జలమయమైంది.
నల్గొండ: ఎస్ఎల్బీసీ కుప్ప కూలింది.
జోగులాంబ గద్వాల్: జూరాల ప్రాజెక్టు గేట్ల రోప్స్ తెగిపోయాయి.
సంగారెడ్డి: మంజీర డ్యాం ఆప్రాన్ వరద దాటికి కొట్టుకుపోగా, పియ్యర్స్ల్లో పగులు వచ్చాయి.
పాలన వైఫల్యం, కాంగ్రెస్ చేతగాని తనం వల్లే ఇన్ని ప్రమాదాలు జరిగాయి. ఇవేవి ఎన్డీఎస్ఏకు కనిపించవు, వినిపించవు.
మేడిగడ్డ కుంగిన వెంటనే ఎన్డీఎస్ఏకు లేఖ రాసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కాంగ్రెస్ హయాంలో జరుగుతున్న ప్రాజెక్టుల ప్రమాదాలు ఎందుకు కనిపించడం లేదు? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. మేడిగడ్డలో 85 పియ్యర్స్ ఉంటే అందులో ఒక పియ్యర్ కుంగిపోతే మొత్తం ప్రాజెక్టే కుప్ప కూలిందని ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి, ఏడాదిన్నరలో జరిగిన ఘటనలకు ఎవరు బాధ్యులు? కాళేశ్వరంపై ఏడుస్తూ కాలం వెల్లదీయడం తప్ప, ఏడాదిన్నరగా మీరు చేసిందేం ఉంది రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు.
ఒక చెరువు తవ్వింది లేదు, ఒక్క చెక్ డ్యాం కట్టింది లేదు, ఒక్క ఎకరాలకు కొత్తగా నీరు ఇచ్చింది లేదు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే కొత్తగా ఆరు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందిస్తామని చెప్పి, ఆరు వేల ఎకరాలకు కూడా ఇవ్వలేదు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో సాధించిన తెలంగాణలో మళ్లా నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం కొట్లాడాల్సిన పరిస్థితి తెచ్చావు అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
నీళ్లు: బనకచర్ల ద్వారా ఏపీ తరలించే కుట్ర
నిధులు: ఏపీకి తరలివెళ్తున్న కేంద్ర నిధులు
నియామకాలు: నోటిఫికేషన్ల కోసం విద్యార్థులు రోడ్లెక్కే పరిస్థితి.
రేవంత్ రెడ్డి! ఇప్పటికైనా కళ్లు తెరువు. తెలంగాణకు ప్రాణాధారం అయిన సాగునీటి రంగాన్ని నీ రాజకీయ అజెండాలకు బలి చేయకు. మేడిగడ్డపై దుష్ప్రచారం ఆపేసి, ఇకనైనా ప్రాజెక్టుల నిర్వహణపై దృష్టి పెట్టు. తెలంగాణ ప్రజలు నీ రోత మాటలతో పాటు, నీ చేతగాని తనాన్ని గమనిస్తున్నారు అని హరీశ్‌రావు పేర్కొన్నారు.