హనుమకొండ చౌరస్తా, నవంబర్ 1 : పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి టికెట్లు అమ్ముకొన్నారని డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ఆరోపించారు. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్న నేతలకు అన్యాయం చేశారని మండిపడ్డారు. హనుమకొండలోని జక్రియ ఫంక్షన్ హాల్లో జరిగిన వరంగల్ పశ్చిమ ఆత్మీయ సమ్మేళనంలో రాఘవరెడ్డి మాట్లాడుతూ.. 30 ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేశానని తెలిపారు.
ప్రజలకు అండగా ఉండి పోరాటం చేసేవారికి కాకుండా, కాంగ్రెస్ పార్టీలో ఉండి ద్రోహం చేసేవారికి టికెట్లు అమ్ముకున్నాడని మండిపడ్డారు. డీసీసీబీ చైర్మన్గా ఉన్నప్పుడు 156 కేసులు నాపై పెట్టినా ఒక్కరోజు భయపడకుండా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని గుర్తుచేశారు. ప్రజాదరణ ఉన్న నాపై అధిష్ఠానం మరోసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని రాఘవరెడ్డి హెచ్చరించారు.